Jun 04,2023 23:57

విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మేయర్‌ తదితరులు

ప్రజాశక్తి-గుంటూరు : ఎంతో మంది ప్రజల అభిమానం పొందిన గానగంధర్వుడు ఎస్‌.పి బాలసుబ్రహ్మణ్యం చిరస్మరణీయుడని నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌నాయుడు అన్నారు. ఆదివారం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా నాజ్‌ సెంటర్‌ సర్కిల్‌లోని ఆయన విగ్రహం వద్ద కళాదర్బార్‌, ది ఠాగూర్‌ మెమోరియల్‌ ధియేటర్‌ ట్రస్ట్‌ ఆధ్వరంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో మేయర్‌ పాల్గొన్నారు. ఎస్పీ బాలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మేయర్‌ మాట్లాడుతూ ఎస్‌.పి బాల సుబ్రహ్మణ్యం తెలుగు వాడిగా పుట్టటం మన అదృష్టమన్నారు. ఆయన గాన మాధుర్యంతో ఎంతో మంది ప్రజల అభిమానాన్ని పొందారని, అటువంటి వారి స్మృతులు ప్రజలు ఎప్పటికి మర్చిపోకూడదని అన్నారు. ఎస్‌.పి బాల సుబ్రమణ్యం దేశంలోని అన్ని భాషలలో పాటలు పాడారని, ఏ భాషలో పాట పాడినా ఆబాషకు చెందిన వ్యక్తిగా పాడేవారని చెప్పారు. ఆయన తెలుగు వారవడం మనం గర్వించదగ్గ విషయం అన్నారు. తెలుగు ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన బాల సుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేసినందుకు కళాదర్బార్‌ అధ్యక్షలు పొత్తూరు రంగారావును అభినందించారు.