Aug 28,2023 21:39

ఎఎస్‌పికి విన్నవిస్తున్న బాధితురాలు

ఎఎస్‌పికి విన్నవిస్తున్న బాధితురాలు
ఎస్‌పి 'స్పందన'కు వినతుల వెల్లువ
ప్రజాశక్తి-నెల్లూరు:స్థానిక ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎస్‌పి డాక్టర్‌ కె.తిరుమలేశ్వరరెడ్డి నిర్వహించిన స్పందన కార్యక్రమానికి బాధితులనుంచి వినతులు వెల్లువెత్తాయి. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపుగా వంద వినతిపత్రాలను బాధితుల నుంచి పోలీసు అధికారులు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్‌పి డాక్టర్‌ కె.తిరుమలేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రేమ పేరుతో మహిళలను మభ్యపెట్టి పెళ్లి చేసుకుంటానని నమ్మించి వ్యక్తిగత సమాచారం, ఫోటోలు తీసుకొని వేధింపులకు గురిచేస్తూ నగదు, బంగారం కాజేసే వ్యక్తుల పట్ల ప్రజలు ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచినలు చేశారు. ఇటీవల కాలంలో అధిక కట్నం కోసం కట్టుకున్న భార్య, బిడ్డల బాగోగులు పట్టించుకోకుండా భర్త, అత్తింటి వారి వేదింపులకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆయా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచనలు చేశామన్నారు. ముఖ్యంగా భూ, ఆస్థి సంబంధిత కోర్టు పరిధిలో ఉన్న వివాదాలకు సంబంధించిన సున్నిత అంశాలలో న్యాయ నిపుణులు, ఉన్నతాధికారుల సలహాలు, సూచనల మేరకు పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.
పోలీసు స్టేషన్లలో నమోదుకాబడిన సాదారణ, బలమైన గాథ, దొంగతనం, మిస్సింగ్‌, కిడ్నాప్‌ కేసులలో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, చార్జ్‌ షీట్‌ ఫైల్‌ చేయాలని, నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా బాధ్యతాయుతంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందన్నారు. స్పందన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, సంబందిత అధికారులతో మాట్లాడి, త్వరితగతిన పరిష్కరించి భాధితులకు న్యాయం చేయాలని సూచనలు చేశామన్నారు. నేటి స్పందన కార్యక్రమంలో ప్రేమ పేరుతో మోసం, నమోదైన కేసులలో పురోగతి, కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ, ఆస్థి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌ లైన్‌, అనధికార చీటీలు, ఉద్యోగాలు, వద్ద తల్లిదండ్రులు వేధింపులు, ఇతర వివాదాలు , సమస్యల ఫిర్యాదులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ యస్‌.పి.(అడ్మిన్‌), (క్రైమ్స్‌), డిఎస్‌పి, డిటిసి ఏఆర్‌ -డిఎస్‌పి, ఎస్‌బి సిఐ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.