కడప అర్బన్ నగరంలోని ప్రఖ్యాత పెద్ద దర్గా ఉరుసు నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు రానుండటంతో ఎస్‌పి సిద్దార్థ్ కౌశల్ సోమవారం విస్తతంగా పర్యటించారు. ఉరుసు ఉత్సవాల సందర్బంగా ఊరేగింపు జరిగే ప్రాంతాల్లోని వివిధ కూడళ్లలో మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల సౌకర్యాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ అధికారులకు, దర్గా ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ఊరేగింపు జరిగే ప్రాంతాలను పరిశీలించారు. పెద్ద దర్గా నుంచి మాసాపేట సర్కిల్ వద్ద ఉన్న చిన్న దర్గా, మాచుపల్లి బస్ స్టాండ్, ఆకుల వీధి, సెవెన్ రోడ్స్, గోకుల్ సర్కిల్, పాత వన్ టౌన్ పిఎస్ సర్కిల్, బికెఎం స్ట్రీట్, మండి బజార్, బళ్ళారి రోడ్‌ను పరిశీలించి చేపట్టాల్సిన భద్రతా చర్యలపై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో దర్గా సందర్శనకు వచ్చే వారు ప్రమాదాల బారిన పడకుండా విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఉరుసు సందర్భంగా చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కడప డిఎస్‌పి ఎస్.ఎం.డి షరీఫ్, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్ అశోక్ రెడ్డి, పోలీస్ అధికారులు ఎస్‌పి వెంట ఉన్నారు.