రాయచోటి టౌన్ : కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యతో తీవ్ర మనస్థాపానికి గురై తాను పని చేస్తున్న కార్యాలయంలోనే ఓ కానిస్టేబుల్ శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రమైన రాయచోటిలోని ఎస్‌పి కార్యాలయంలో చోటు చేసుకుంది. వివ రాల్లోకి వెళితే...కడప జిల్లా పోరుమామిళ్ళ మండల కేంద్రంలోని శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన కవలకుంట్ల రవి అనే 2009 బ్యాచ్‌కు చెందిన సివిల్ కానిస్టేబుల్ సంవత్సరం నుంచి అన్నమయ్య జిల్లా ఎస్‌పి కార్యాలయంలోని డిసిఆర్‌బి అనే ఓవింగ్‌లో పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా రవి కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యతో బాధపడుతూ తీవ్ర మనస్థాపానికి గురై తాను పని చేసే కార్యాల యంలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు సొంత ఊరులో ఉండ డంతో రవి ఎస్‌పి కార్యాలయంలోనే ఉంటూ హోటల్‌ల్లో తింటూ ఆఫీసులోనే నిద్రిస్తూ వచ్చారు. తెల్లవారిన కూడా ఆఫీసు తలుపులు తీయకపోవడంతో కార్యాలయానికి వచ్చిన తోటి సిబ్బంది తలుపును ఇనుప రాడ్డు సహాయంతో బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూసే సరికి కానిస్టేబుల్ రవి ఉరి వేసుకొని వేలాడుతూ ఉన్నాడు. వెంటనే సిబ్బంది కిందకు దింపి హుటాహుటిన రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిక్షించి రవి మృతి చెందినట్లు నిర్ధారించారు. రవి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అక్కడ నుండి మార్చురీలోకి తరలించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యతోనే రవి ఆత్మహత్యకు కారణమైవుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. డిఎస్‌పి మహబూబ్ బాషా ఆరా తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.