ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక ఎస్‌ఒఎస్ చిల్డ్రెన్స్ విలేజ్‌ను తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం సందర్శించారు. అనాథలకు శాశ్వత అండగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అనాధ పిల్లల సంక్షేమానికి వివిధ రాష్ట్రాల్లో పలు స్వచ్ఛంద సంస్థల పని తీరును అధ్యయనం మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలోని మంత్రి వర్గ ఉప సంఘం అధ్యయనం చేసింది. నివేదికను సిఎం కెసిఆర్‌కు అందజేయగా, అందుకు అనుగుణంగా మరిన్ని అంశాలు ఉండేలా సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని కెసిఆర్ ఆదేశించినందున మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతి హోలి కేరి, సిఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, హరిత హారం ఓ ఎస్డీ ప్రియాంక వర్గీస్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ పమేలా సత్పతితో కూడిన ఉన్నతాధికారుల బందం స్థానిక ఎస్‌ఒఎస్ చిల్డ్రన్స్ విలేజ్‌ను సందర్శించింది. విలేజ్ డైరెక్టర్ కోన రవీంద్ర కుమార్, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఎస్‌ఒఎస్ చిల్డ్రన్స్ విలేజ్ కార్య కలాపాలు, అనాధ పిల్లలకు అందిస్తున్న సేవలు, పొందు తున్న సౌకర్యాలు, విలేజ్‌లో ఉన్న పిల్లలు, వారి సంరక్షణ బాధ్యత చూసే తల్లులు అందిస్తున్న సేవలు తదితరాలపై వివరించారు.










