Oct 14,2023 21:21

ఉమ్మడి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావుకు వినతిపత్రం సమర్పిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

           ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ కొనసాగించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివ, ఓతురు పరమేష్‌ డిమాండ్‌ చేశారు. శనివారం విజయవాడలో ఉమ్మడి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌కెయులో విసి రామకృష్ణారెడ్డి నియంతృత్వ పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. విసి ఛార్జి తీసుకున్న రోజు నుంచి యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలను గాలికి వదిలేసి వివాదాస్పద అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని తెలిపారు. యూనివర్సిటీలో ప్రశ్నించే తత్వం ఉన్న ఎల్‌.ఎల్‌.బి కోర్స్‌ రద్దు చేస్తామని గత సంవత్సరం సర్కులర్‌ జారీ చేశారని తెలిపారు. ఎల్‌.ఎల్‌.బి రద్దుకు వ్యతిరేకంగా మేథావులు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకించిన తర్వాత ఆ రకమైన ఆలోచనను ఉపసంహరించుకున్నారని తెలిపారు. అలాగే మత్యుంజయ మోమం జరుపుతానని గెస్ట్‌ ఫ్యాకల్టీతో, ప్రొఫెసర్లతో డబ్బులు వసూలు చేసి మత్యుంజయ హోమం నిర్వహిస్తానని సర్కులర్‌ చేసిన సందర్భంలో మేథావులు, విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తే ఆ విధానాన్ని ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ పీజీ కోర్సును రద్దు చేశారన్నారు. విద్యార్థులు ఎంఏ అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ చదవడానికి అవకాశం లేదని మొదటి కౌన్సిలింగ్‌ సర్కులర్‌ జారీ చేశారని తెలిపారు. విసి ఏమైనా ఆలోచన జ్ఞానం ఉంటే ఇప్పటికే యూనివర్సిటీ హాస్టల్లో కనీసం తాగడానికి మంచి నీరు కరెంటు సదుపాయం, మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యలను పట్టించుకోకున్నట్టుగా విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఎంఏ అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ రద్దు చేస్తానని చెప్పడం దౌర్భాగ్యమైన విషయం అన్నారు. యూనివర్సిటీలో 32 పీజీ కోర్సులు ఉంటే వాటిలో 1016 సీట్లు ఉంటే మొదట జరిగినటువంటి కౌన్సిలింగ్‌లో కేవలం 361 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని, ఇంకా 803 సీట్లు మిగిలిపోయాయని తెలిపారు. యూనివర్సిటీలో విసి పరిపాలన వల్ల పీజీలో ఉన్న సీట్లను కూడా మిగిలిపోతున్నాయని తెలిపారు. విసి రామకృష్ణారెడ్డి యూనివర్సిటీలో నియంతృత్వ విధానాన్ని విరమించుకోవాలన్నారు. అలాగే కావున విసీ ఎంఏ అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ కోర్స్‌ని కొనసాగించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావుకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్సీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ, ఉన్నత విద్యా కమిషన్‌ ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వైటిసి.రమేష్‌, శివ, రజిత, భీమేష్‌ తదితరులు పాల్గొన్నారు.