Apr 27,2023 00:01

తహశీల్దార్‌ కార్యాలయంలో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు

ప్రజాశక్తి - మేడికొండూరు : తహశీల్దార్‌ కరుణకుమార్‌ కారులో ఏసీబీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. అనధికారికంగా కలిగి ఉన్న రూ.లక్ష 4,700 నగదుతోపాటు పలు రికార్డులు, ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తహహశీల్దార్‌ను అదుపులోకి తీసుకుని పలు అంశాలపై వివరాలు అడిగారు. కార్యాలయంలోని పలు విభాగాల కంప్యూటర్‌ డేటాలను తనిఖీ చేసి గత ఆరు నెలల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని పెండింగ్‌లో పెట్టారు? ఎన్ని తిరస్కరించారు? అందుకు కారణాలు ఏమిటి? అనే అంశాలపైన విచారణ చేస్తున్నారు.
ప్రస్తుత తహశీల్దార్‌ 2009లో ఇదే కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసుండగానూ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గతేడాది కాలంలో మేడికొండూరు, వరగానికి గ్రామాలకు చెందిన విఆర్‌ఒలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి సస్పెండ్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖపై ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతవారంలో ఏసీబీ కార్యాలయానికి టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా అనేక ఫిర్యాదులు అందాయని, అందులో భాగంగానే తహశీల్దార్‌పై బృందాలుగా ఏర్పడి ప్రత్యేక నిఘా పెట్టామని ఏసీబి డీఎస్పీ టివివి ప్రతాప్‌కుమార్‌ తెలిపారు. తనిఖీలు మరిన్ని చేయాల్సి ఉందని, అవి పూర్తయ్యాక కేసు నమోదు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ కార్యాలయంలో సంప్రదించాలని, వివరాలకు 8332971038 ఫోన్‌ నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. తనిఖీల్లో ఏబీసీ ఇన్‌స్పెక్టర్లు రవిబాబు, అంజిబాబు, మన్మథరావు, సురేష్‌బాబు, ఎఎస్‌ఐ శ్రీనివాసమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.