
ఎస్‌ఇఎఎస్ పరీక్షలకు సన్నద్ధం చేయాలి
- జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
అన్ని యాజమాన్య పాఠశాలల్లో 3, 6, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు (స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్‌మెంట్ సర్వే) పరీక్షలపై తగు రీతిలో అవగాహన కల్పించి సన్నద్దం చేయాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని ఎస్‌పిజి, సెయింట్ జోసెఫ్ పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థుల ఎస్‌ఇఎఎస్ పరీక్షల ప్రిపరేషన్‌పై కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్‌ఇఎఎస్ సర్వే కింద ఎంపికైన పాఠశాలలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పిల్లలను తగు రీతిలో సన్నద్ధం చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ప్రాక్టీస్ పేపర్స్‌ను ఈ వారం రోజులు విద్యార్థులతో తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయించాలని సూచించారు. మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ఎస్‌ఇఏఎస్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సర్వేలో ఎంపికైన ప్రతి పాఠశాల ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పిల్లలను సన్నద్దం చేయాలని ఆదేశించారు. మండలాల్లో ఎమ్మార్వో, ఎంపీడీవోలు, నియోజకవర్గస్థాయిలో స్పెషల్ ఆఫీసర్లు కూడా పాఠశాలలను సందర్శించి విద్యార్థుల ప్రాక్టీస్‌పై పరిశీలిస్తారని తెలిపారు. మండల విద్యాధికారులు మండలంలోని ప్రతి పాఠశాలను సందర్శించి, విద్యార్థుల ప్రాక్టీస్‌పై జిల్లా విద్యాశాఖాధికారికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ప్రతిరోజు ఎగ్జామినేషన్ మోడ్‌లో కూర్చోబెట్టి పిల్లలకు ప్రాక్టీస్ పేపర్ ఇచ్చి, టీచర్ గైడ్‌గా ఉంటూ, వారితో స్వయంగా ప్రాక్టీస్ చేయించాలన్నారు. ప్రతి రోజూ ప్రాక్టీస్ ఫొటోస్ అధికారిక వాట్సప్ గ్రూప్‌లో షేర్ చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా, అలసత్వం వహించినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.