Oct 24,2023 19:52

ఏజెన్సీలో నాటుసారా తయారు చేస్తున్న వ్యక్తి (ఫైల్‌)

ప్రజాశక్తి - పాలకొండ : గుట్కా, నాటు సారా నిర్మూలనతో పాటు బెల్టు షాపులను నిరోధించడానికి ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఇబి)ని ఏర్పాటు చేసింది. వారి ద్వారా మత్తు పదార్థాల నిర్మూలనకు ఉక్కుపాదం వేయాలని నిర్ణయించింది. పాలకొండ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో స్టేషన్‌ పరిధిలో పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని మండలాలు ఉన్నాయి. అయితే ఆరు నెలల నుంచి ఎస్‌ఇబికి రెగ్యులర్‌ సిఐ లేకపోవడంతో పార్వతీపురం సిఐకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన పని ఒత్తిడి కారణంతో ఇక్కడ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో తూ.తూ మంత్రంగానే తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పాలకొండ ఏజెన్సీ పరిధిలో నాటు సారా అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగాయి. సీతంపేట, భామిని మండలాల్లో అడ్డూ అదుపు లేకుండా నాటుసారా తయరవుతోంది. పాలకొండ, వీరఘట్టం మండలాల్లో సారా విక్రయం జోరుగా జరుగుతోంది. పాలకొండ పట్టణంలో రెల్లివీధి, జెంగల వీధి, కొత్త వీధి ప్రాంతాల్లో నాటు సారా విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన దాఖలాలు లేవు.
జోరుగా గుట్కా విక్రయాలు
పాలకొండ, వీరఘట్టం మండలాల్లో ఒడిశా నుండి ఇక్కడికి అక్రమంగా గుట్కా రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీరఘట్టం ప్రధాన రహదారిలో ఓ గోడౌన్‌లోనే నిల్వలు ఉన్నట్లు సమాచారం. పాలకొండలో నగర పంచాయతీ కార్యాలయం సమీపంలోనే గుట్కా నిల్వలు ఉన్నట్లు తెలిసింది. ప్రతి షాపులో కూడా గుట్కాలు విక్రయం విచ్చలవిడిగా సాగుతోంది.
విచ్చలవిడిగా బెల్టు షాపులు
పాలకొండ పట్టణంలో ఎన్‌కె రాజపురం, కోటదుర్గ ఆలయ జంక్షన్‌, గొల్ల వీధి ప్రాంతంతోపాటు పల్లుకుడిలిలో బెల్టుషాపుల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. బాటిల్‌పై అదనంగా రూ.20 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో కూడా 24 గంటలు మద్యం ఏరులై పారుతోంది. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఎస్‌ఇబి అధికారులు స్పందించి మద్యం, గుట్కా, సారా విక్రయాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.