* రూ.20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన వైనం
ప్రజాశక్తి - రణస్థలం : మండలంలోని కోటపాలెం గ్రామ రెవెన్యూ అధికారి పి.శ్రీనివాసరావు అవినీతి నిరోధకశాఖ అధికారులకు గురువారం చిక్కారు. భూమి పాస్ పుస్తకం మార్చడానికి రూ.20 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఎసిబి డిఎస్‌పి బి.వి.ఎస్.ఎస్ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... రణస్థలం మండలం కోటపాలెంకు చెందిన గొర్లె సన్యాసప్పలనాయుడు కొన్నాళ్ల కిందట మరణించారు. ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య వరలక్ష్మి, రెండో భార్య శ్రీదేవి. ఇటీవల భూ సమగ్ర రీ సర్వేలో సన్యాసప్పలనాయుడుకు చెందిన భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలు రెండో భార్య శ్రీదేవి పేరుతో వచ్చాయి. దీంతో మొదటి భార్య వరలక్ష్మి రణస్థలం తహశీల్దార్‌కు, స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశించడంతో, ఆ దరఖాస్తు విజయనగరంలో నివాసం ఉంటున్న కోటపాలెం విఆర్‌ఒ శ్రీనివాసరావు వద్దకు వెళ్లింది. విఆర్‌ఒను కలిసిన వరలక్ష్మి సమస్యను వివరించారు. పాస్ పుస్తకాలు మార్చడానికి రూ.30 వేలు లంచం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇవ్వలేనని, రూ.20 వేలు ఇస్తానని ఆమె ఒప్పందం కుదుర్చుకున్నారు. లంచం డిమాండ్ చేయడంతో ఆమె ఎసిబి అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు రూ.20 వేలు తీసుకుని ఆమె విజయనగరంలో విఆర్‌ఒ నివాసానికి వెళ్లారు. లంచం డబ్బులు అందజేస్తుండగా, ఎసిబి అధికారులు దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విఆర్‌ఒ శ్రీనివాసరావును రణస్థలం తహశీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి స్టేట్‌మెంట్స్ రికార్డు చేశారు. కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్టు చేశారు. విశాఖపట్నం ఎసిబి కోర్టులో విఆర్‌ఒను హాజరుపరుస్తామని డిఎస్‌పి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే 14400 నంబరుకు ఫిర్యాదు చేయాలని, శ్రీకాకుళంలోని ఎసిబి కార్యాలయానికి నేరుగా వచ్చి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. దాడిలో ఎసిబి సిఐలు భాస్కరరావు, హరి సిబ్బంది పాల్గొన్నారు.










