- రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన గౌరీశంకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: ఎసిబి వలలో అవినీతి చేప చిక్కింది. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గౌరీశంకర్ రూ.20 వేలు తీసుకుంటూ అధికారులకు మంగళవారం పట్టుబడ్డారు. ఎసిబి అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం శ్రీకాకుళం నగరంలోని హడ్కోకాలనీ సమీపంలోని భారతీనగర్‌కు చెందిన ఒక బాధితుడు తన ఖాళీ స్థలానికి సంబంధించిన ట్యాక్స్‌ను ప్రాసెస్ చేయడానికి ఆర్‌ఐను కలిశారు. పని జరగడానికి రూ.30 వేలు లంచాన్ని గౌరీశంకర్ డిమాండ్ చేయగా, రూ.20 వేలు ఇచ్చేందుకు బాధితుడు అంగీకరించాడు. డబ్బులు సిద్ధం చేసి ఆర్‌ఐకి కబురు పంపారు. రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ఎసిబి కోర్టులో బుధవారం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఎసిబి 1400కు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా డిజిపి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు చెప్పారు. దాడుల్లో సిఐలు భాస్కర్, హరి, ఎస్‌ఐలు శాంతారావు, చిన్నంనాయుడు పాల్గొన్నారు.










