Jul 18,2023 23:36

పట్టుబడిన నాగప్రసాద్‌

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరులోని శుభం కళ్యాణ మండపంలో తాత్కాలిక ప్రాతిపదికన ఫర్నీచర్‌ విక్రయ ఎగ్జిబిషన్‌ నిర్వహణకు అనుమతి కోసం జిఎస్‌టి అధికారులు రూ.40 వేలు లంచం డిమాండ్‌ చేయగా అడ్వాన్సుగా రూ.15 వేలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని మంగళవారం పట్టుకున్నారు. ఎసిబి అధికారుల కథనం ప్రకారం... చెన్నరుకు చెందిన ప్రాంప్ట్‌ ట్రేడ్‌ ఫెయిర్స్‌ ఇండియా ఆధ్వర్యంలో ఇటీవల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఇందుకు అనుమతి కోసం సంస్థ అకౌంట్స్‌ మేనేజర్‌ వి.వెంకటేషన్‌ సుందర్‌ రాజన్‌ జిఎస్‌టి అధికారులకు దరఖాస్తు చేశారు. స్థానిక వసుంధర కాంప్లెక్స్‌ జిఎస్‌టి కార్యాలయ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ తోడేటి నాగప్రసాద్‌ సుందర్‌రాజన్‌ నుంచి రూ.40 వేలు డిమాండ్‌ చేశారు. దీంతో అతను ఎసిబి అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు అడ్వాన్సుగా రూ.15 వేలు ఇస్తుండగా ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడు నాగప్రసాద్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చనున్నట్టు ఎసిబి అదనపు ఎస్‌పి మహేష్‌ తెలిపారు.