May 22,2023 23:41

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : లంచం తీసుకుంటున్న దేవాదాయ, ధర్మాదాయ శాఖ గుంటూరు డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావును ఎసిబి అధికారులు వలపన్ని సోమవారం పట్టుకున్నారు. ఎసిబి డిఎస్‌పి ప్రతాప్‌ కథనం ప్రకారం.. మేడికొండూరు మండలం సిరిపురంలో చెపరాల సూర్యప్రకాష్‌రావు అనే వృద్ధుడు శ్రీసీతారామ దేవాలయం ట్రస్టుకు 55 ఎకరాలను దేవస్థాన కైంకర్యాల కోసం దానం చేశారు. అయితే సూర్యప్రకాశరావు మీద స్థానిక గ్రామస్తులు దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరరావును విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆదేశాలు ఇచ్చారు. విచారణలో భాగంగా సూర్యప్రకాశరావును కలిసిన సందర్భంలో గత మార్చిలోనే రూ.5 వేలు లంచంగా తీసుకున్నాడు. సూర్యప్రకాశరావు ఈ మధ్యకాలంలో రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలకు కొన్ని రాయితీలను కోరుతూ హైకోర్టులో పిటీషన్‌ వేశారు. అయితే దానికి సంబంధించి కౌంటర్‌ వేయాలంటే మరో రూ.5 వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇది ఇష్టం లేని సూర్యప్రకాశరావు ఎసిబిని ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫీసులో లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.