ప్రజాశక్తి -అరకులోయ రూరల్(అల్లూరి సీతారామరాజు జిల్లా)
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండల తహశీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ మజ్జి అర్జున్ రూ.35 వేల లంచం తీసుకుంటూ సోమవారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. అడిషనల్ ఇన్‌ఛార్జి డిఎస్‌పి బివిఎస్‌ఎస్ రమణమూర్తి కథనం ప్రకారం... అరకులోయ మండలం పెదలబుడు పంచాయతీ పాణిరంగిని గ్రామానికి చెందిన కిల్లో రామ్‌చందర్‌కు ఎన్‌హెచ్ 516 జాతీయ రహదారి నిర్మాణంలో నష్ట పరిహారం రిపోర్టు ఇవ్వడానికి సుమారు రూ.50 వేల లంచం ఇవ్వాలని ఆర్‌ఐ డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని రామ్‌చందర్ చెప్పడంతో వాయిదాల పద్దతిలో కుదుర్చుకున్ని మొదట ఆర్‌ఐ రూ.10 వేలు తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు, ప్రజలు అందరూ ఉన్నారని చెప్పి హౌసింగ్ కార్యాలయం వద్దకు తీసుకువెళ్లి నేరుగా ఆర్‌ఐ అర్జున్ రూ.35 వేలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు అక్కడికి చేరుకొని ఆర్‌ఐను పట్టుకున్నారు. ఈ ఆర్‌ఐ గతంలో అనంతగిరి మండలంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. అరకులోయ తహశీల్దార్ కార్యాలయం ఆర్‌ఐగా విధుల్లో చేరి రెండు నెలలు అయింది. ఆర్‌ఐని అదుపులోకి తీసుకుని విశాఖపట్నం ఎసిబి కోర్టులో హాజరు పరచనున్నట్లు ఇన్‌ఛార్జి డిఎస్‌పి రమణమూర్తి మీడియాకు తెలిపారు. ఈ దాడుల్లో ఎసిబి సిబ్బంది సిహెచ్ రమేష్, కిషోర్, ప్రేమ్‌కుమార్, శ్రీనివాస్, సంతోష్ సిబ్బంది పాల్గొన్నారు.










