Apr 03,2023 21:14

లంచంగా తీసుకున్న డబ్బులు

ఎసిబి వలకు చిక్కిన ట్రాన్స్‌కో ఎఇ
ప్రజాశక్తి-ఆత్మకూరు

       నంద్యాల జిల్లా ఆత్మకూరు విద్యుత్‌ సబ్‌డివిజన్‌ పరిధిలోని కొత్తపల్లి, పాములపాడు మండలాల విద్యుత్‌ శాఖ ఎఇ వేణుగోపాల్‌రాజు అతని అనుచరుడు జంబులయ్య రూ. 50 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఎసిబికి దొరికి పోయారు. అవినీతి నిరోధక శాఖ డిఎస్‌పి శివ నారాయణ స్వామికి అందిన సమాచారం మేరకు రెడ్‌ హ్యాండ్‌గా పట్టుకున్నారు. పాములపాడు మండలం పరిధిలోని భానుముక్కల గ్రామానికి చెందిన బాలీశ్వరయ్య వెంకటరమణతో పాటు మరికొందరు రైతులు ఇటీవల బోరుబావులు వేయించుకున్నారు. వాటికి విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు విద్యుత్‌ శాఖ ఎఇ వేణుగోపాల్‌ రాజు రూ. 70 వేల లంచం అడిగాడు. అప్పటికే రైతులు రూ.20 వేలు ఇచ్చినప్పటికీ ఎఇ స్పందింలేదు. తిరిగి రూ.50 వేల ఇస్తేనే పనులు చేస్తానని చెప్పాడు. దీంతో భానుముక్కలకు చెందిన రైతులు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంద్రదించారు. ఇందులో భాగంగానే ఆత్మకూరు పట్టణంలోని గీతా భవన్‌హోటల్‌ ఎదురుగా రైతుల నుండి ఎఇ వేణుగోపాల్‌ రాజు మధ్య దళరిగా ఉంటున్న జమ్ములయ్య రూ.50 వేల తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వారిని రెడ్‌ హ్యాండ్‌ గా పట్టుకున్నారు. ఎసిబి డిఎస్‌పి శివన్నారాయణ మాట్లాడుతూ మధ్య దళారి జమ్ములయ్యను అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రజలు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల చేత పనులు చేయించుకునేటప్పుడు లంచాలు ఇవ్వడం సరైనది కాదని, ఎవరైనా లంచం అడిగినట్లయితే తమ దృష్టికి తీసుకొని రావాలని ఆయన సూచించారు. మధ్య దళారీగా ఉన్న జమ్ములయ్య పాములపాడు మండలం లింగాల గ్రామానికి చెందిన వైసిపి నాయకుడిగా చలామణి అవుతున్నట్లు తెలిసింది.