Sep 14,2023 20:59

పాలకొల్లు

:గౌరవనీయులైన ఎసిబి జడ్డిని కొంత మంది సోషల్‌ మీడియాలో అవమానపరుస్తూ పెడుతున్న పోస్టులను ఖండిస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖను కోరినట్లు జాతీయ బిసి ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు చెప్పారు. గురువారం ఆయన పాలకొల్లులో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10న చంద్రబాబు కేసు విచారణలో 14 రోజుల పాటు రిమాండ్‌ విధిస్తూ ఎసిబి జడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్న వ్యక్తులు, ఈ విధంగా బిసి సామాజిక వర్గానికి చెందిన జడ్జిని అవమానపర్చడం సరికాదన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారిని కులాల పేరు ఆపాదిస్తూ, వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. జడ్డి స్థానంలో ఉన్నవారు, విధి నిర్వహణలో న్యాయమూర్తిగా, న్యాయ సూత్రాలను అనుసరిస్తూ తీర్పులిస్తారు గాని, కులమతాలకు అనుగుణంగా తీర్పులు ఇవ్వరని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు కాండ్రేకుల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు గోనబోయిన దుర్గారావు, ఎస్‌కె బాజీ, ముంగండ సురేష్‌, యలమంచిలి మండల అధ్యక్షుడు అనిశెట్టి నవీన్‌ పాల్గొన్నారు.