ఎస్‌హెచ్‌జి గ్రూపులు బ్రాండ్ అంబాసిడర్లు : కలెక్టర్
ప్రజాశక్తి - చిత్తూరు
స్వయం సహాయక సంఘాల నిర్వహణలో చిత్తూరు జిల్లా మెరుగైన స్థానంలో ఉందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించి జిల్లాను మెరుగైన స్థానం లో నిలపాలనికలెక్టర్ ఎస్. షన్మోహన్ అన్నారు. గురువారం చిత్తూరులోని డి ఆర్ డి ఏ సమావేశ మందిరంలో జిల్లా సమాఖ్య మహాజన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్. షన్మోహన్ మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు ధీటుగా మారుతున్న మార్కెటింగ్ పరిస్థితులకు అనుగుణంగా నాణ్యమైన కొత్త ఉత్పత్తులను తయారు చేయాలని, అందుకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల ద్వారా తయారు చేస్తున్న ఆహార పదార్థాలు రుచి తో పాటు ఆరోగ్య పరంగా, ఎక్కువ రోజులు నిలువ ఉండేలా చూసుకుంటే మార్కెటింగ్ పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. తయారీ విధానంలో మెళకువలు నేర్చుకొనుటకు పొరుగు రాష్ట్రాలలో వ్యాపార విధానాలు, తయారీ విధానాలపై అవగాహన కొరకు ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని తెలిపారు. చిత్తూరు లోని అమూల్ డెయిరీ ద్వారా అమూల్ పాల వెల్లువ ద్వారా పాలను కొనడంతో స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా లాభ పడవచ్చునని తెలిపారు. తమ ఉత్పత్తుల ద్వారా ఎస్ హెచ్ జి గ్రూప్ లు జిల్లాకు బ్రాండ్ అంబాసిడర్ లు కా వాలని, నూతన ఆలోచనలతో ముందుకెళ్ళి రానున్న కొత్త సంవత్సరంలో జిల్లా లో ఒక పెద్ద పరిశ్రమను స్థాపించే స్థాయికి వెళ్లాలని ఆశిస్తున్నానని తెలిపారు. డి ఆర్ డి ఏ పిడి తులసి మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు మహిళా మార్ట్ లు విజయవంతంగా లాభాల బాటలో పయనిస్తున్నాయని, చేతివత్తుల కళాకారులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకున్నామని, పసుపు ప్రాసెసింగ్ యూనిట్ విజయవంతంగా కొనసాగుతున్నదని తెలిపారు. జిల్లాలో 150 సంఘాలకు ప్రత్యేక రుణాలు అందించి చిన్న వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి చర్యలు చేపట్టామన్నారు. పొరుగు రాష్ట్రాల్లో వ్యాపార కార్యక్రమాలపై సంఘ సభ్యులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో 74 పాలశీతలీకరణ కేంద్రాలు పనిచేస్తున్నాయని, వీటి ద్వారా 25 వేల కుటుంబాలకు మంచి ఆదాయం వస్తున్నదన్నారు. సబ్సిడీతో దానామతంతో పాటు, జొన్న, మొక్కజొన్న విత్తనాలను సైతం అందిస్తున్నామని, దీని ద్వారా పాల దిగుబడి పెరిగే అవకాశం ఉందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే డిఆర్డిఏ సహకారంతో పాడి పరిశ్రమ పై ఆధారపడిన గ్రామీణ ప్రాంత సంఘ సభ్యులకు రాయితీతో చాప్ కట్టర్లు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే నాటు కోళ్ళు, మేకలు, గొర్రెలు పెంపకానికి కూడా రాయితీతో కూడిన రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో ఏపీడి రవి, డిపిఎం లు వెంకటేష్, రవికుమార్, ఏజీఎం ప్రకాష్, ఏపీఎంలు మధుసూదన్, సూరి, అరుణ, హేమ, అనురాధ, ఖాదరవల్లి, శంకర్ జిల్లా సమాఖ్య ప్రతినిధులు మంజుల, జయశ్రీ, నూర్జహాన్, జమున, చంద్రకళ పాల్గొన్నారు.










