
ప్రజాశక్తి - పరవాడ
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగులు మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఎమ్‌ఇఒ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎపి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జేఏసీ పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్ విద్యా సొసైటీలో 2012 సంవత్సరం నుండి ఎంఐఎస్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మండల లెవెల్ అకౌంటెంట్, సిఆర్పిలు, ఐఈఆర్‌టిలు, పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. వీరందరూ ఉన్నత చదువులు చదువుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపిక చేయబడ్డారని, అందువలన ప్రభుత్వ ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర శిక్ష అభియాన్ సొసైటీలో పనిచేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని, పనికి తగ్గ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జులై నెల జీతాలు ఇంకా ఇవ్వలేదని, అందుకు తగ్గ బడ్జెట్ ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. ప్రతి నెల 1వ తేదీ నాటికి జీతాలు జమ అయ్యేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.గోపాలరావు, నాగేశ్వరరావు, జి శ్రీనివాసరావు, ఎమ్ వరప్రసాద్ పాల్గొన్నారు.
జెఎసి ధన్యవాదాలు
అనకాపల్లి : ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జేఏసీ పిలుపుమేరకు ఈ నెల 21, 22 తేదీలలో జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, రాంబిల్లి, పరవాడ, బుచ్చయ్యపేట, రావికమతం తదితర మండలాల్లో విద్యాశాఖ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాన ఎస్‌ఎస్‌ఎ ఒప్పంద ఉద్యోగులకు జెఎసి జిల్లా చైర్మన్ వివి.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.