Nov 20,2023 19:53

మృతి చెందిన చిన్నారులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
ఎస్‌ఎస్‌ ట్యాంకులో కాలుజారి పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని పెద్దహరివాణం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. నీరు తాగేందుకు వెళ్లిన చిన్నారులు కాలు జారి ఎస్‌ఎస్‌ ట్యాంకులో పడిపోయారు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్దహరివాణం గ్రామానికి చెందిన తుకారాం, పార్వతిల కుమారుడు మంజునాథ (11) 5వ తరగతి, అబ్బాస్‌, ఆషాల కుమారుడు అలీ అక్బర్‌ (10) 4వ తరగతి మండల పరిషత్‌ తెలుగు ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి బయల్దేరారు. పాఠశాలలో బ్యాగులను ఉంచి బయటకొచ్చి గ్రామానికి సమీపంలో ఉన్న ఎస్‌ఎస్‌ ట్యాంకులో నీళ్లు తాగేందుకు వెళ్లి కాలు జారిపడి పడ్డారు. అక్కడే ఉన్న ఒక బాలుడు, మృద్ధురాలు కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చారు. పది మంది యువకులు ఎస్‌ఎస్‌ ట్యాంకులోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. అరగంట తర్వాత పిల్లలు దొరకడంతో ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. చిన్నారులు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పిల్లల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తాలూకా సిఐ నిరంజన్‌ రెడ్డి, ఇస్వి ఇన్‌ఛార్జీ ఎస్‌ఐ పీరయ్య తెలిపారు. తుకారాం, పార్వతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందారు. అబ్బాస్‌, ఆషాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న అలీ అక్బర్‌ మృతి చెందారు.
చిన్నారుల తల్లిదండ్రులకు పరామర్శ
పిల్లల కుటుంబ సభ్యులను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు రామాంజనేయులు, మండల కార్యదర్శి కె.లింగన్న, వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ జయ మనోజ్‌ రెడ్డి, ఆర్‌సిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ రెడ్డి, ఎంఇఒ శివరాములు, సిఆర్‌పి హుసేనప్ప, సర్పంచి రాము, గ్రామస్తులు పరామర్శించారు.
ఎస్‌ఎస్‌ ట్యాంకుకు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి
- సిపిఎం మండల కార్యదర్శి లింగన్న

ప్రమాదవశాత్తు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులో పడి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి, తక్షణమే ఎస్‌ఎస్‌ ట్యాంకుకు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి. పెద్దహరివాణం గ్రామంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అక్బర్‌ అలీ, మంజునాథలు ఎస్‌ఎస్‌ ట్యాంకులో తాగునీటి కోసం వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. ఆ కుటుంబాలకు తక్షణమే రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలి. విద్యార్థుల కుటుంబాలకు సర్పంచి ఇచ్చిన హామీ మేరకు 15 రోజుల్లోపు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి. లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం.

ఎంఇఒతో మాట్లాడుతున్న సిపిఎం మండల కార్యదర్శి లింగన్న
ఎంఇఒతో మాట్లాడుతున్న సిపిఎం మండల కార్యదర్శి లింగన్న