Sep 10,2023 21:47

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
              సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక కలెక్టరేట్‌ వద్ద ఆర్ట్‌, క్రాఫ్ట్‌, పిఇటి రాష్ట్ర అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు అధ్యక్షతన వేడుకోలు దీక్ష ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్‌ ఎన్నికలకు ముందు ప్రజాసంకల్ప పాదయాత్రలో కలిసినప్పుడు 'మన ప్రభుత్వం వస్తుంది.. మీ అందరి సమస్యలు తీరుస్తుంది' అని చెప్పి అధికారంలోకి వచ్చారని, వచ్చి నాలుగేళ్లయినా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేస్తామని, జిఒ 40 కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా సమగ్ర శిక్ష, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, పిఇటి కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే సమగ్ర శిక్షా, కెజిబివిలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలనీ, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.