Oct 22,2023 19:39

ప్రజాశక్తి - యలమంచిలి
           వారంతా గతంలో విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐలో వివిధ హోదాల్లో పనిచేసి ప్రస్తుతం ఎవరికి వారు తమ తమ వృత్తులు, రాజకీయ జీవితంలో బిజీగా ఉన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ కార్యకర్తలంతా కలిసి ఆదివారం మండలంలోని చించినాడ గ్రామంలోని స్థానిక కొబ్బరితోటలో ఎస్‌ఎఫ్‌ఐ ఎక్సలెంట్‌ టీం పేరుతో సమ్మేళనంలో కలుసుకున్నారు. ఈ ఈ సందర్భంగా గతంలో తాము విద్యార్థుల సమస్యలపై చేసిన పోరాటాలను, విజయాలను, అదే క్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నుంచి నేర్చుకున్న క్రమశిక్షణను నెమరు వేసుకుని ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆట పాటలతో, అభ్యుదయ గీతాలు ఆలపిస్తూ సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు దొండపాటి అజరు అధ్యక్షత వహించగా తొట్టెంపూడి కోటేశ్వరరావు, అరటి కట్ల రవి, పూరిళ్ల శ్రీనివాస్‌లు మాట్లాడారు. తాము 1985 నుంచి 2000 సంవత్సరం వరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆశయం కోసం అందరికీ విద్య, ఉపాధి సాధించడమే లక్ష్యంగా పోరాడమన్నారు. ఇప్పటికీ అవే సమస్యలు ఉత్పన్నం కావడం దురదృష్టకరమన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని గుర్తించాలన్నారు. ప్రస్తుతం తమ సభ్యులంతా వివిధ వృత్తుల్లో కొనసాగుతున్నప్పటికీ ఎల్లవేళలా ఎస్‌ఎఫ్‌ఐ, ప్రజా ఉద్యమాలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ నాయకులు బిఇ తిరుమలరాజు, జోగి శ్రీను, కేతవాసు టివి.అప్పారావు, తెన్నేటి వెంకటేశ్వరరావు, శీలం గంగాధరరావు పాల్గొన్నారు.