Sep 26,2023 22:14

ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను బలవంతంగా అరెస్టు చేస్తున్న పోలీసులు

 

ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై పోలీసుల దాష్టీకం
ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై పోలీసుల దాష్టీకం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  విద్యారంగ సమస్యలతో పాటు వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపైనా, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపైనా పోలీసులు జులుం ప్రదర్శించారు. ఆందోళన చేస్తున్న విషయం అధికారులకు తెలియజేయాల్సిన పోలీసులు విద్యార్థులపై తమ ప్రతాపం చూపారు. బట్టలూడదీసి జుత్తు పట్టుకొని నడిరోడ్డుపై ఈడ్చుకు పోయారు. 31మందిని అరెస్టుచేసి, సాయంత్రం విడిచిపెట్టారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. అధికారులెవరూ స్పందించి బయటకు రాక పోవడంతో విద్యార్థులు కలెక్టరేట్‌ ఔట్‌ గేటు ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి డి.రామును డిఎస్‌పి మాట్లాడుదామని పిలిచి రాస్తారోకో విరమించాలని కోరారు. విద్యార్థులతో మాట్లాడి చెబుతానని చెప్పిన రామును బలవంతంగా అరెస్టుకు పాల్పడ్డారు. దీంతో విద్యార్థులంతా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఐదుగురు ఎస్‌ఐలు, పదుల సంఖ్యలో పోలీసులు బలవంతంగా రోడుపై రాము షర్ట్‌ను లాగేసి ఈడ్చుకెల్లి వ్యానులో ఎక్కించారు. దీంతో భగ్గుమన్న విద్యార్థులు ఆ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో అడ్డంగా బైఠాయించారు. పోలీసులు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రామకృష్ణ, మరి కొంత మంది విద్యార్థినులను బలవంతంగా ఈడ్చుకెళ్ళి అరెస్టు చేశారు. మిగతా విద్యార్థులు వెరవకుండా మరోవైపు ఆందోళన కొనసాగించారు. వారిని లాక్కెెళ్ల్లేందుకు మహిళా పోలీసులు నానా తంటాలు పడ్డారు. 'కేసులు పెడతాం, వీరి ఫోటోలు తీయండి, రౌడీల్లా ఉన్నారు.. జుత్తు పట్టుకొని లాగేయండి.. రాకపోతే తన్ని ఎడ్చుకెళ్తాం' అంటూ టూ టౌన్‌ సిఐ, ఎస్‌ఐలు విద్యార్థినులను బెదిరించారు. అదనంగా మహిళా పోలీసులను తీసుకొచ్చి రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి అరెస్టులకు పాల్పడ్డారు. అంతేకాకుండా వ్యాన్‌లో ఎక్కించిన తరువాత ఎస్‌ఎఫ్‌ఐ నాయకురాలు సౌమ్యను వన్‌టౌన్‌ ఎస్‌ఐ మురళీ పలుమార్లు కొట్టి బూతులు తిట్టారు. పోలీసుల తీరుపై సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీకు ఆడ పిల్లలు లేరా? మీ ఆడవాళ్ళతో ఇలాగే మాట్లాడతారా? అంటూ నిలదీశారు. తాము సమస్యలు పరిష్కారానికి ధర్నా చేస్తే అతిగా వ్యవహరించి అరెస్టులు చేయడం అన్యాయ మన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో మీ పిల్లలు చదివితే కష్టాలు తెలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన విద్యార్థులను ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్‌కు, మరికొందరిని గంట్యాడ స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో డి.రాము, ఎం.సౌమ్యతో పాటు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్‌ రామకృష్ణ, వి.చిన్నబాబు, జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్‌, లావణ్య, భారతి, ఉమా, భాను తదితరులు ఉన్నారు. వీరందరినీ సాయంత్రం వీరందరినీ విడిచిపెట్టారు.

ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై పోలీసుల దాష్టీకం

 

ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై పోలీసుల దాష్టీకం


సమస్యలు పరిష్కరించేవరకు పోరాడుతాం
అంతకు ముందు ధర్నాను ఉద్దేశించి జిల్లా సహాయ కార్యదర్శి డి.రాము మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలని కాస్మోటిక్‌ ఛార్జీలు ఇవ్వాలని, సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల టెక్స్ట్‌ బుక్స్‌ అందించి మధ్యాహ్న భోజన వసతి కల్పించాలన్నారు. వియయ నగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం కల్పించాలని, జీవో నెంబర్‌ 77 రద్దుచేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించాలన్నారు. పెండింగ్‌ లో ఉన్న విద్య, వసతి దీవెనలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని, బాలికల హాస్టల్‌ లో శానిటరీ ప్యాడ్స్‌ అందించాలని, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.
ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల అరెస్టు అన్యాయం
కలెక్టరేట్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్వ్యంలో ధర్నా చేస్తున్న విద్యార్థులను, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను రోడ్లపై ఈడ్చి, బట్టలు చించి అరెస్టులు చేయడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌ వెంకటేష్‌, పి.రామ్మోహన్‌ రావు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సమస్య చెప్పనీయకుండా అరెస్టులు చేస్తోందని అన్నారు. అరెస్టులు, బెదిరింపులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు.
పోలీసు చర్యలకు సిపిఎం ఖండన
సమస్యల పరిష్కారానికి ఆందోళన చేస్తున్న విద్యార్థులను బట్టలూదీసి ఈడ్చుకుపోవడమే కాకుండా వ్యాన్‌లో ఎక్కించిన తరువాత విద్యార్థినులపై పోలీసులు చేయి చేసుకోవడం దుర్మార్గమని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. పోలీసు చర్యలను ఆయన ఖండించారు. పోరాటాలపై నిర్బంధాలు ప్రయోగించడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.