ప్రజాశక్తి-కాకినాడ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) 24వ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో కాకినాడలో నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పి.వరహాలు, ఎం.గంగా సూరిబాబు తెలిపారు. శుక్రవారం మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం స్థానిక యుటిఎఫ్ భవన్‌లో నిర్వహించారు. మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మహాసభల లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యల కోసం ఎస్‌ఎఫ్‌ఐ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రంలో దేశంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోందన్నారు. భవిష్యత్తులో విద్యార్థి లోకాన్ని చైతన్య పరచడం కోసం మరిన్ని పోరాటాలు నిర్వహించడం కోసం డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో నిర్వహిస్తున్న మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.ప్రసన్నకుమార్, ఎ.అశోక్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకీ రాకముందు విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని మొత్తం కార్పొరేట్, ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. ఈ మహాసభల్లో రాష్ట్రంలో విద్యారంగంలో వస్తున్న మార్పులు వివిధ విద్యారంగ విధానాలపై చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో శ్రీ అగస్త్య విద్యాసంస్థల చైర్మన్ డి.నాగేశ్వరావు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు నగేష్, టిడిపి నగర నాయకులు రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు టి.రాజా, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు పి.నాగేశ్వరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి పద్మ, ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్.రమణి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శ్రీకాంత్, వాసుదేవ్, రాము, గోపాల్, సంజరు, శివ, సిద్దు, వెంకటేశ్, చిన్ని, మల్లేశ్వరి, రాజేష్ ,ఆదర్శ పాల్గొన్నారు.