ప్రజాశక్తి - బాపట్ల
విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు బహుముఖ ప్రజ్ఞ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ కృషి అభినందనీయమని ఎంఇఒ ఎస్ నిరంజన్ అన్నారు. ఎస్ఎఫ్ఐ, యుటీఎఫ్, జెవివి ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన బహుముఖ పోటీల్లో ప్రతిభకనపరిచిన విజేతలకు బాపట్ల సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందనకు ఆయన హాజరయ్యారు. కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి మనోజ్ కుమార్ అధ్యక్షత వహించారు. నిరంజన్ మాట్లాడుతూ లక్ష్యసాధనలో విద్యార్థులు కృషి పట్టుదలతో భవిష్యత్తులో రాణించాలన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆర్య మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సంక్షేమం కోసం పోరాడటంతోపాటు నిరంతరం మారుతున్న సమాజంలో విద్యార్థులు సామాజిక బాధ్యతతో సమాజాన్ని చైతన్యపరిచే దిశగా చదువుల్లో రాణించాలన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు వై భాస్కరరావు మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలని అన్నారు. మూఢనమ్మకాలకు తావు లేకుండా సమాజంలో జరిగే ప్రతి మార్పును శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేయాలన్నారు. మూఢనమ్మకాల నిర్మూలన విద్యార్థుల బాధ్యత అన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










