ప్రజాశక్తి-ఎడ్యుకేషన్: ఎస్‌ఎఫ్‌ఐ 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కళాశాలలో కళాశాల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్ ఎస్‌ఎఫ్‌ఐను జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్ మాట్లాడుతూ అధ్యయనం, పోరాటం అనే నినాదంతో 1970లో ఏర్పడిన ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం అనేక పోరాటాలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విదత్యా విధానం ప్రభుత్వ విద్యా రంగాన్ని నాశనం చేస్తుందన్నారు. విద్యారంగాన్ని కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేస్తుందని దీనికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలను ఎస్‌ఎఫ్‌ఐ నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు, కళాశాల కమిటీ సభ్యులు ప్రణీత, మన్మధ, రాజ్‌కుమార్, ప్రసాద్, సుష్మ, హేమ, పావని, మాళవిక, భార్గవ్ పాల్గొన్నారు. ప్రజాశక్తి-మైలవరం: ఎస్‌ఎఫ్‌ఐ 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎస్‌ఎఫ్‌ఐ మైలవరం మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక డిగ్రీ కళాశాల వద్ద జెండాను ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎంకె నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేసేది ఎస్‌ఎఫ్‌ఐ అని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్న వాటిని పట్టించుకోవడంలేదన్నారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77ను రద్దుచేసి పీజీ విద్యార్థులకు వసతి దీవెన, విద్యా దీవెనను వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి ప్రేమ్ కుమార్, మండల అధ్యక్షులు అజరు కుమార్ పాల్గొన్నారు. ప్రజాశక్తి-తిరువూరు: ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జెండాను మండల కమిటీ అధ్యక్షురాలు ఎం.నాగేంద్రమ్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు బి.వెంకటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ మం డల ఉపాధ్యక్షురాలు సోని, నాగరాజు, సురేష్, తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇబ్రహీంపట్నం ఐటిఐ కళాశాలలో నిర్వహించారు. జెండాను ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎం.సోమేశ్వరరావు ఎగురవేశారు. ఈ సందర్భంగా సోమేశ్వరరావు మాట్లాడుతూ కేరళ రాష్ట్రం త్రివేండ్రంలో అధ్యయనం పోరాటం అనే నినాదంతో 1970లో ఏర్పడిన ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల చదువుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం.మహేష్ పాల్గొన్నారు.










