Apr 22,2023 00:49
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-బాపట్ల: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ అగ్రికల్చర్‌ ఫార్మశీ రంగాల్లో మోడల్‌ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు ఎస్‌ఎఫ్‌ఐ బాపట్ల జిల్లా కార్యదర్శి ఆర్య తెలిపారు. శుక్రవారం బాపట్ల విజిఆర్‌ఎం జూనియర్‌ కళాశాలలో మోడల్‌ టెస్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష కార్యదర్శులు మనోజ్‌కుమార్‌, ఆర్య మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ అధ్యయనం, పోరాటం నినాదంతో దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదుగుతోందన్నారు. విద్యార్థులను చైతన్యవంతులను చేస్తూ వారు చదువుల్లో మరింతగా రాణించేలా తోడ్పాటునందిస్తోందని అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి 30 వరకు మోడల్‌ పరీక్షలు చీరాల సెయింట్‌ ఆన్స్‌ కళాశాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నత ఆశయంతో వివిధ రంగాలలో ఇంజనీరింగ్‌ విద్య అభ్యసించాలని సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుభవజ్ఞులైన చుక్కా రామయ్య ఐఐటీ అకాడమీ నుంచి సబ్జెక్టుల్లో నిష్ణాతులైన అధ్యాపకులు తయారు చేసిన మోడల్‌ పేపర్‌తో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని బాపట్ల జిల్లా విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్‌ కోసం విద్యార్థులు చదువుకుంటున్న కళాశాలలో గాని, ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో గాని, ఈ మొబైల్‌ నెంబర్ల 8121111513, 9490987646లో గాని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో విజయరాం కళాశాల డైరెక్టర్‌ గిరిధర్‌, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.