Feb 18,2023 00:09

ధర్నా చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులతో మాట్లాడుతున్న అధికారులు

ప్రజాశక్తి-నక్కపల్లి:నక్కపల్లిలో బీసీ హాస్టల్‌ కు నూతన భవనం మంజూరు చేసి, విద్యార్థుల ఇబ్బందులను తొలగించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద హాస్టల్‌ విద్యార్థులతో కలిసి ధర్నా చేపట్టారు. బీసీ బాలుర వసతి గృహం చాలా అధ్వానంగా ఉందని, మౌలిక వసతులు, మరుగుదొడ్లు సక్రమంగా లేవని దీంతో హాస్టల్‌ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రమణ, ఉపాధ్యక్షులు బాబ్జి, కార్యదర్శి రమణ, కోశాధికారి తరుణ్‌, సహాయ కార్యదర్శి బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ బార్సు హాస్టల్‌ కు సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో ఉంటున్నారని, అద్దె భవనం పూర్తిగా అధ్వానంగా ఉందని ఆవేదన వెలిబుచ్చారు. అనేకసార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా నేటి వరకు పరిష్కారానికి మార్గం చూపలేదన్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. గత సంవత్సరం హాస్టల్లో 200 మంది విద్యార్థులు ఉండేవారని,ప్రస్తుతం హాస్టల్లో వసతి సౌకర్యం సక్రమంగా లేనందున 40 మాత్రమే విద్యార్థులు ఉంటున్నారన్నారు. బీసీ హాస్టల్‌ కు సొంత భవనం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించి భవన నిర్మాణ పనులను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి చలో కలెక్టరేట్‌ నిర్వహిస్తామన్నారు. ఎంపీడీవో సీతారామరాజు, ఎంఈఓ డివిడి ప్రసాద్‌ లకు వినతిపత్రం అందజేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్సీ హాస్టల్‌ లోకి మార్పు
ఎంపీడీవో సీతారామరాజు
జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు బీసీ హాస్టల్‌ విద్యార్థులను ఎస్సీ హాస్టల్లోకి మార్పు చేస్తున్నట్లు ఎంపీడీవో సీతారామరాజు తెలిపారు . శుక్రవారం అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, ఎంఈఓ డివిడి ప్రసాద్‌లతో కలిసి నక్కపల్లి బీసీ, ఎస్సీ హాస్టల్‌, గొడిచెర్లలో బీసీ వెల్ఫేర్‌ హాస్టల్‌ను తనిఖీ చేశారు. వసతి గృహాల్లో నెలకొన్న వసతి సౌకర్యం, మరుగుదొడ్లు, లైట్లు ఫ్యాన్లు, తాగునీరు, దోమలు బెడద తదితర సమస్యలను క్షుణంగా పరిశీలించారు. వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఎంపీడీవో మాట్లాడుతూ, నివేదికను జిల్లా కలెక్టర్‌ కు అందజేస్తామన్నారు. స్థానిక గురుకులం ను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.