ప్రజాశక్తి-పాడేరు: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలు నామమాత్రంగానే పెంచిందని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద గురువారం గిరిజన విద్యార్థులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులకు 3 నుంచి 4 తరగతుల వారికి రూ.1150, 5 నుంచి 10 తరగతుల వారికి రూ.1400, ఇంటర్ ఆపై చదువు విద్యార్థులకు రూ.1600 చొప్పున పెంచినట్టు ప్రభుత్వం ప్రకటించిందని, ఇవి ఏ మేరకు సరి పోవని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.చిన్నారావు మాట్లాడుతూ, మెస్, కాస్మొటిక్ చార్జీలు ప్రభుత్వం పెంచి ఐదు సంవత్సరాలు అవుతుందన్నారు. ప్రస్తుతం మెస్ ఛార్జీలను మొక్కు బడిగా పెంచిందని, అర్ధ రూపాయి ఇచ్చి పండగ చేసుకోమన్నట్లుగా ప్రభుత్వం తీరు ఉందని హెద్దేవా చేశారు. కరోనా తర్వాత నిత్యావసర ధరలు భారీగా పెరిగాయని, ప్రభుత్వం మాత్రం మెస్ చార్జీలు నామ మాత్రంగా పెంచిందన్నారు. నూతన మెనూకు పెంచిన ఛార్జీలు ఏ మాత్రం సరిపోవన్నారు. దీంతో గిరిజన విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. సంక్షేమ హాస్టల్లో పౌష్టికాహారం అందాలంటే నెలకి రూ.2500లు పెంచాలని డిమాండ్ చేశారు. ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలన్నారు. రెండేళ్ల నుండి కాస్మొటిక్ చార్జీలు ఇవ్వ లేదని, వీటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు కె.మాణిక్యం, మత్య్సరాజు, నరేష్ పాల్గొన్నారు
ముంచింగిపుట్టు:ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యుడు కొర్ర డోంబ్రు డిమాండ్ చేశారు. దోడిపుట్టు పంచాయతీ తలబిరడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచి ఐదు ఏళ్ళు గడుస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేశారు.










