ప్రజాశక్తి-పాడేరు:అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలపై విచారణ చేపట్టాలని శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రభుదాస్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో వివిధ ఆశ్రమ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు మృత్యువాత కు గురయ్యారని, దీనిపై విచారణ జరిపి, విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. కార్పొరేట్ కళాశాలలను తలపించే రీతిలో ప్రభుత్వ కళాశాలలో ఫీజులు వసూలు చేయడంతో గిరిజన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. గిరిజన విద్యా సంస్థలలో హెల్త్ వాలంటీర్లను, ఏఎన్‌ఎంలను, వాచ్మెన్లలను నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని, దీంతో విద్యార్థులు పలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం విద్యను దూరం చేస్తోందని.. విమర్శించారు. గిరిజన విద్యా సంస్థలలో కనీస మౌలిక వసతులు విద్యార్థులకు కరువ య్యాయని, ఇటువంటి పరిస్థితులలో విద్యను ఎలా అభ్యసిస్తారని ప్రశ్నించారు. భవిష్యత్తులో హాస్టల్, స్కూల్స్‌లో సర్వేలు చేస్తామని, సమస్యలు వెలుగులోకి తీసుకొస్తామని చెప్పారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి సంఘాలకు ప్రవేశాన్ని నిషేధించే ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీ అనంతరం గిరిజన విద్యార్థుల సమస్యలపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్ స్పందించి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని ప్రభుదాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కన్వీనర్ రాజశేఖర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు చిన్నారావు, జీవన్, కార్తీక్, విద్యార్థులు పాల్గొన్నారు.










