Jan 24,2023 00:00

ధర్నా చేపడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నేతలు

ప్రజాశక్తి-నక్కపల్లి:నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తిస్థాయిలో అధ్యాపకులను నియమించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాగ రమణ డిమాండ్‌ చేశారు. సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు డిగ్రీ కళాశాల నుండి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యంశాస్త్రికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసి, నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ల్యాబ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ముగ్గురు అధ్యాపకులతో నడపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో అధ్యాపకులు లేకపోతే విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన ఎలా అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత భవనం, ల్యాబ్‌ సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు రమణ, బాబ్జి, భువనేశ్వరి, శ్రావణి శివ తదితరులు పాల్గొన్నారు.