Jan 13,2022 16:44

న్యూఢిల్లీ :  ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంజాబ్‌ ప్రజలే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయాలంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. 24 గంటల అనంతరం పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామన్న కేజ్రీవాల్‌ గురువారం ఒక ఒక ఫోన్‌ నెంబర్‌ని విడుదల చేశారు. '70748 70748' నెంబరుకి ప్రజలు కాల్‌ చేసి లేదా మెసేజ్‌ లేదా వాట్సాప్‌ ద్వారా తమకు నచ్చిన అభ్యర్థి పేరును చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను రాష్ట్రంలోని మూడు కోట్ల మంది ప్రజలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు కేజ్రీవాల్‌ తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాన్ని జనవరి 17 సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయాలన్నారు. ప్రజల ఓట్ల ద్వారా సిఎం అభ్యర్థిని ఎంపిక చేసే విధానాన్ని అమలు చేయడం ఇదే తొలిసారి అని అన్నారు.
పంజాబ్‌ ఆప్‌ పార్టీ శాఖ అధ్యక్షుడు, సంగ్రూర్‌ ఎంపి భగవంత్‌ మాన్‌ సింగ్‌ని ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ ఊహాగానాలు చెలరేగాయి. భగవంత్‌ మాన్‌ సింగ్‌ తనకు ప్రియమైన వ్యక్తి అని, సిఎం అభ్యర్థిని ఎంపిక చేయాల్సిందిగా మాన్‌ను కోరానని, అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని నాలుగు గోడల మధ్య ఎంపిక చేయవద్దని, ప్రజల వద్దకు వెళ్ళాలని మాన్‌ సూచించారని కేజ్రీవాల్‌ తెలిపారు. పంజాబ్‌ ముఖ్యమంత్రిని నిర్ణయించేది ప్రజలేనని.. పార్టీ అధిష్టానం కాదంటూ ఇటీవల పంజాబ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.  ఫిబ్రవరి 14న జరగనున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు ప్రధాన పార్టీలేవీ కూడా సిఎం అభ్యర్థిని ప్రకటించలేదు.