ప్రజాశక్తి -ములగాడ : ఎస్‌బిసి బ్రిడ్జి పై నుంచి ప్రజావాహనాలను అనుమతించాలని కోరుతూ మల్కాపురం బస్ స్టాప్ వద్ద సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు మాట్లాడుతూ, డాక్ యార్డు బ్రిడ్జి మరమత్తుల కోసం వాహనాల రాకపోకలను 15నెలల పాటు ఆపివేయడానికి నిర్ణయించారని, అంతవరకు పక్కనే ఉన్న ఎస్‌బిసి బ్రిడ్జి పై నుంచి ప్రజా వాహనాల రాకపోకలకు నేవల్ అధికారులు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా కలెక్టర్‌కు వినతులు అందించినట్లు తెలిపారు. అయినా ఇంతవరకూ ఎవరూ స్పందించలేదన్నారు. ఈ నెల 15వ తేదీ లోపు వాహనాల రాకపోకలు బంద్ చేస్తామని పత్రికా ప్రకటన ద్వారా తెలుపుతున్నారని, దీనిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. గాజువాక నుంచి సింధియా వరకు 2లక్షల మంది నివసిస్తున్నారని, వేలాది ఉద్యోగులు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు కెజిహెచ్‌కు, ఇతర ప్రయివేట్ ఆసుపత్రులకు, కోర్టులకు సకాలంలో చేరుకోవాలంటే ఇదే రహదానిని వినియోగిస్తున్నారని తెలిపారు. దీన్ని మూసివేయడం వల్ల ఇప్పుడున్న బస్సు మార్గం గుండా ప్రయాణిస్తే ప్రజల ప్రాణాలకు రక్షణ ఉండదన్నారు. ఆ రహదారిలో ప్రమాదాలకు అవకాశముందని వివరించారు. నేవీ అధికారులను ఒప్పించి ఎస్‌బిసి బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలకు అనుమతించేలా చూడాలని కోరారు. లేకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సిపిఎం మల్కాపురం జోన్ కార్యదర్శి పి.పైడిరాజు మాట్లాడుతూ, డాక్‌యార్డు బ్రిడ్జి రాకపోకలు ఆపకముందే ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సిపిఎం చేస్తున్న పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ నెల 6న కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టే ధర్నాలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్.లక్ష్మణమూర్తి, కె.పెంటారావు, ఎ.సత్యారావు, ఎల్.కృష్ణ, వాసు, ఏసుబాబు, ఆర్.అప్పన్న, రాజేష్, హరి, మహేంద్ర, రామకృష్ణ, బి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.