ప్రజాశక్తి - రామభద్రపురం : విశాఖపట్నం ఎఒ, బొబ్బిలి రీజియన్ పరిధిలో ఉన్న ఎస్‌బిఐ సేవా కేంద్రాల వినియోగం పెరిగేలా అన్ని శాఖల మేనేజర్లు, సిబ్బంది సహకరించాలని బొబ్బిలి రీజినల్ మేనేజర్ అబ్దుల్ హసీబ్ అమీర్ తెలిపారు. స్థానిక కార్యాలయంలో బ్రాంచ్ మేనేజర్లు, అధిక బిజినెస్ ప్రతిభ కనబరిచిన సేవా కేంద్ర నిర్వాహకులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాంచ్‌లతో పాటు సేవా కేంద్రాలకు బిజినెస్ టార్గెట్స్ ఉన్నతాధికారులు ఇస్తున్నారని తప్పనిసరిగా అందరూ టార్గెట్స్ కంప్లీట్ చేసి రీజియన్‌కు మంచి పేరు తేవాలని కోరారు. ఈ ఏడాది అర్థ సంవత్సర ముగింపు కాలానికి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ బ్రాంచ్ పరిధిలో సీఎస్‌పీలకు బహుమతి ప్రదానం చేశారు. దీనిలో భాగంగా స్థానిక రామ భద్రపురం సీఎస్‌పీ సత్యారావు పట్నాయక్ ఉత్తమ అవార్డును అమీర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఇతని సేవలకు గాను గత 4 సంవత్సరాలుగా పలు దఫాలుగా జిల్లా, ఏవో, రీజియన్, మండల స్థాయిలో అనేక సందర్భాల్లో అవార్డ్స్ అందుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జన సురక్షా పదకాలైన పీఎంఎస్‌బివై, జెజెబివై, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలు అర్హులైన ప్రతీ వ్యక్తి చేసుకొని కుటుంబ రక్షణ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఐసి మేనేజర్ కళ్యాణ్ తేజేస్వి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.










