
ప్రజాశక్తి - బాపట్ల
ఐఏఎస్ అధికారిగా ప్రజలకు వినూత్న సేవలందించిన ఎస్ఆర్ శంకరన్ జీవిత చరిత్రను ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలని మానవ వనరుల అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ జనరల్ డి చక్రపాణి అన్నారు. శంకరన్ 13వ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఆదివారం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అధికారిగా ఐఏఎస్ పదవికే వన్నెతెచ్చారని అన్నారు. శంకరన్ జీవిత చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ఆయన చరిత్రను ప్రాథమిక స్థాయి నుండే పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన బీకాం మొదటేడాది విద్యార్థిని ఎన్ నిఖిత, ద్వితీయ బిఏ విద్యార్థిని డి ఇందుమతిలకు శంకరన్ పతకాలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె మాల్యాద్రి, ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు పాల్గొన్నారు.