ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఎస్‌ఐ మెయిన్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కాకినాడలో నిరుద్యోగులు కదం తొక్కారు. మెయిన్ పరీక్షకు సన్నద్ధం కావడానికి రెండు నెలలు గడువు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ సమీపంలో ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. పోలీస్ అధికారులు సైతం నిరుద్యోగుల్లో గందరగోళానికి కారణం అవుతున్నారని విమర్శించారు. ఫిజికల్ ఈవెంట్స్ మొయిన్ పరీక్షలకు ఎంత సమయం వ్యవధి ఉండాలో కూడా ప్రభుత్వానికి, ఉన్నత పోలీస్ అధికారులకు తెలియకపోవడం శోచనీయమన్నారు. ఎస్‌క్ష్మి అభ్యర్థులకు మొయిన్ పరీక్షను కనీసం రెండు నెలల పాటు వాయిదా వేయాలని, లేని పక్షంలో 30 వేల మంది అభ్యర్థులతో కలిసి డిజిపి కార్యాలయాన్ని ముట్ట డిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఎపి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పోలీస్ కానిస్టేబుల్స్ 6100, ఎస్‌ఐ 410 పోస్టులకు 2022 నవంబర్ 28న నోటిఫికేషన్ విడుదల చేసిందని, ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు తర్వాత తక్కువ పోస్టులతోనే నోటిఫికేషన్ ఇచ్చార న్నారు. బోర్డు షెడ్యూల్ ప్రకారం మార్చిలో ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన ఎస్‌క్ష్మి అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించాల్సి ఉందన్నారు. కానీ ఎంఎల్‌సి ఎన్నికల కారణంగా వాయిదా వేశారన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు రేంజ్‌లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారన్నారు. ఇవి సెప్టెంబర్ 25న జరిగాయన్నారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో మొయిన్స్ పరీక్షలు ఉండటంతో ఫిజికల్ ఈవెంట్స్‌కు మొయిన్ పరీక్షలకు కేవలం 20 రోజులు మాత్రమే ప్రిపేరేషన్‌కు గడువు ఉంటుందన్నారు. దీని వల్ల అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని గుర్తు చేశారు.
ఎపి ఉద్యోగ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధికీ మాట్లాడుతూ సిలబస్ విస్తతి రీత్యా కనీసం 2 నెలలు అయినా గడువు పెంచాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షల్లో 8 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారన్నారు. వారి సమస్యలను పరిష్కరించి వారి సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎత్తు, కొలతలలను కొలిచే సెన్సార్ వల్ల 2018లో ఈవెంట్స్ లో 168 సెంటీమీటర్లు ఎత్తు ఉండి అర్హత సాధించిన అభ్యర్థి ఈ దఫా నిర్వహించిన ఈవెంట్స్ లో 166 సెంటీమీటర్లు ఎత్తున మాత్రమే సెన్సార్ చూపించడం వల్ల అర్హత కోల్పోయాడని గుర్తు చేశారు. ఇటువంటి తప్పులు అనేకమంది అభ్యర్థుల విషయంలో జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దీని వల్ల వేలాది మంది అభ్యర్ధులకు అన్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు టి.రాజా, విజరు కుమార్, తోట నాగాంజనేయులు, పోతురాజుల రాజేష్, పంచాడ రాజు, పంచాడ భాస్కరరావు, కాశీరాజు దేవరకొండ, ఏడుకొండలు పాల్గొన్నారు.










