ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : ఎస్‌ఐ పోస్టులకు గుంటూరు పోలీసు పెరెడ్ గ్రౌండ్స్‌లో జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు శనివారం నుంచి నిర్వహిస్తామని గుంటూరు రేంజ్ ఐజి పాల్‌రాజు తెలిపారు. శుక్రవారం జరగాల్సిన పరీక్షను వర్షం కారణంగా వాయిదా వేశామని, శుక్రవారం హాజరు కావాల్సిన అభ్యర్థులు వచ్చేనెల 16న హాజరు కావాలని సూచించారు. శనివారం నుంచి జరగాల్సిన షెడ్యూలు ప్రకారం పరీక్షలు యథాతథంగా జరుగుతాయని చెప్పారు. ఈ మేరకు పరీక్షలపై జిల్లా ఎస్‌పి ఆరీఫ్ హఫీజ్‌తో కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన అధికారులు, పాఠశాలల ఫిజికల్ డైరక్టర్లతో గురువారం సమీక్షించారు. విధులు ఉండే సిబ్బంది నిజాయితి,నిబద్ధతతో పని చేయాలని, అభ్యర్థులు ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అభ్యర్థులు ఎట్టి పరిస్థితిల్లోనూ దళారులను నమ్మొద్దని సూచించారు. ప్రతి అభ్యర్థి ఒరిజినల్ ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించుకుని ఇచ్చిన తేదీ ప్రకారం హాజరవ్వాలన్నారు. పరీక్షలు నిర్వహణంతా సిసి కెమెరాల్లో రికార్డు అవుతుందని, ఆ డేటాను టెక్నికల్ విభాగం సిబ్బంది ఎప్పటికప్పుడు స్టోర్ చేయాలని చెప్పారు. సమీక్షలో అడ్మిన్ అడిషనల్ ఎస్‌పి సుప్రజ, ఎఆర్ అదనపు ఎస్పీ కె.కోటేశ్వరరావు, ఎఆర్ డిఎస్‌పి చంద్రశేఖర్‌రావు, స్పెషల్ బ్రాంచ్ సిఐ బాలసుబ్రమణ్యం, సిబ్బంది పాల్గొన్నారు.










