ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విద్యారంగ సమస్యల పరిష్కారానికి మంగళవారం కలెక్టరేట్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన ఆందోళన సందర్భంగా విద్యార్థినులను తీవ్రంగా కొట్టి, వారిని బూతులు తిట్టిన ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ ఎస్‌ఐ బి.మురళిని సస్పెండ్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ, జిల్లా గర్ల్స్ కన్వీనర్ లావణ్య డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులపై బుధవారం కోట జంక్షన్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో మెస్‌ఛార్జీలు పెంచాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేయాలని విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తే, విజయనగరం ఒకటవ పట్టణ ఎస్‌ఐ బి.మురళి విద్యార్థి నాయకులపై దుర్భాషలాడారని తెలిపారు. అంతేకుండా ఎం. సౌమ్య, లావణ్యలను అరెస్టు చేసి వ్యాన్‌లో తీసుకెళ్తుండగా బూతులు తిడుతూ కొట్టారని, కులాల పేరుతో దూషించారని తెలిపారు. తక్షణమే ఎస్‌ఐ మురళిపై అధికారులు విచారణ వేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల పోరాటాలను మరింత ఉద్రిత్తం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమం లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు వి.చిన్నబాబు, జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ పట్టణ కార్యదర్శి పి.రమేష్, పట్టణ కమిటీ నాయకులు సంధ్య, గుణ, మధు విద్యార్థులు పాల్గొన్నారు.
భౌతిక దాడిని ఖండిస్తున్నాం : డివైఎఫ్‌ఐ
విద్యార్థులను, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను రోడ్లపై ఈడ్చి, బట్టలు చించి అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్ హరీష్, ఎన్.రుద్రప్రసాద్ తెలిపారు. నాయకులపై భౌతిక దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలి,భౌతిక దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.










