Jul 03,2023 20:53

జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న డివైఎఫ్‌ఐ నాయకులు

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు
ఫిజికల్‌ ఈవెంట్స్‌ నిర్వహించాలి : డివైఎఫ్‌ఐ
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు తక్షణమే ఫిజికల్‌ ఈవెంట్స్‌ నిర్వహించాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌, పట్టణ కార్యదర్శి శివ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రిలిమ్స్‌ పరీక్షలు జనవరి చివరిలో నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేసిందని, ఎన్నికలు ముగియగానే నిరుద్యోగులను, ముఖ్యంగా ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్‌ ఈవెంట్స్‌ నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు. దీని ఫలితంగా ముందే నిరుద్యోగంతో బాధపడుతున్న లక్షలాదిమంది ప్రతి నెలా 8 నుండి 10 వేల రూపాయలు రూమ్‌ బాడుగలు, హాస్టల్‌, మెస్‌, స్టడీ హాల్స్‌కి ఖర్చు పెట్టుకోవాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫిజికల్‌ ఈవెంట్స్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా డివైఎఫ్‌ఐ పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు వినీత్‌, సంజరు తదితరులు పాల్గొన్నారు.