ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచండి
- జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ వ్యవసాయ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రంలోని కియోస్కి మెషీన్‌ను, మాయిశ్చర్ మీటర్‌ను, ఎరువులు భద్రపరచిన గోడౌన్‌ను కలెక్టర్ పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ రికార్డులను తనిఖీ చేస్తూ అందుబాటులో వున్న ఎరువులు, విత్తనాల స్టాక్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు తమ పరిధిలోని సాగయ్యే విస్తీర్ణానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఇప్పుడిప్పుడే రైతులు పొలాల్లో సేద్యం పనులు మొదలు పెట్టారని, సాగుకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ
అనంతరం నంద్యాల పట్టణం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని తిక్కస్వామి దర్గా -1 అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. హాజరుపట్టిక, పిల్లల బరువు, ఎత్తు రిజిస్టర్, పౌష్ఠికాహార పదార్థాలు, మందులు, తదితర రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. పిల్లల బరువు, ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం నిర్ధేశించిన మెనూ ప్రకారం క్రమం తప్పకుండా గర్భిణులకు, చంటి పిల్లలకు పోషకాహారం అందివ్వాలని అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. రక్తహీనత గల గర్భిణులకు ఐరన్ ఫోలిక్ టాబ్లెట్లు, పోషకాహార పదార్థాల కిట్టును సరఫరా చేయాలన్నారు. వీలైతే అంగన్వాడీ కేంద్రంలోనే పోషకాహార పదార్థాలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్మల ఉన్నారు.










