- 'గడప గడప' పనులకు బిల్లులు చెల్లించకపోవడం నిర్లక్ష్యమే
- ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులపై అసహనం
- ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలి
- జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల విషయంలో ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జెడ్‌పి సమావేశ మందిరంలో పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖను సమీక్షిస్తూ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న 208 ప్రాధాన్యతా భవనాలకు గానూ 129 భవనాలు తుది దశలో ఉన్నందున ఆగస్టు నెలాఖరుకు, మిగిలిన 79 భవనాలు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని సూచించారు. తుది దశలో ఉన్న 61 సచివాలయాలు, 48 రైతుభరోసా కేంద్రాలు, 20 వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్స్ భవనాలను వచ్చే నెలాఖరు లోగా పూర్తి చేసి సంబంధిత శాఖలకు అప్పగించాలన్నారు. ఇప్పటివరకు చేపట్టిన భవనాలకు పూర్తి చెల్లింపులు జరిగాయని, మిగిలిన భవనాలకు కూడా సిమెంటు, ఇసుక, నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. కొత్తూరులో గడప గడపకు మన ప్రభుత్వం కింద మంజూరైన నీటి ట్యాంకును ఫిబ్రవరిలో నిర్మించినా ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని స్థానిక ప్రజాప్రతినిధి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. బిల్లుల చెల్లింపుపై సరైన సమాధానం చెప్పలేకపోవడంతో ఆర్‌డబ్ల్యుఎస్ డిఇపై అసహనం వ్యక్తం చేశారు. గడప గడప పనులపై అన్ని నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష నిర్వహించాలని ఎస్‌ఇని ఆదేశించారు. నిధుల చెల్లింపుల్లో కావాలనే జాప్యం చేసినట్లు రుజువైతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ నియోజకవర్గానికి ప్రధానమంత్రి గ్రామీణ్ పథకం కింద తప్ప జగనన్న ఇళ్లు మంజూరు చేయకపోవడం ప్రజల్లో కొంత అసంతృప్తి ఉందని చెప్పారు. ప్రస్తుతం గృహనిర్మాణ శాఖ పిఎం గ్రామీణ్ కింద 3,163 గృహాలు మంజూరు చేశారని చెప్పారు. వీటితోపాటు మరో సొంత స్థలాలు కలిగిన 3,600 మందికి గృహాలు నిర్మించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్నందున, వారూ గృహాలు నిర్మించుకునేందుకు అనుమతిని కోరుతున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చిన పనుల వివరాలను తక్షణమే అప్‌లోడ్ చేయాలని ఎంపిడిఒలను ఆదేశించారు. హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మండలం బొర్రంపేట పంచాయతీల్లోని సచివాలయాలను వచ్చే గురువారం నాటికి పూర్తి చేసి నివేదిక అందజేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. మెళియాపుట్టి, కొత్తూరు మండలాల్లోని దుర్గంపేట, మెట్టూరు పంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి తెలియజేస్తే, ఆ స్థలంలో గృహ నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతిని మంజూరు చేస్తామని తహశీల్దార్లకు తెలిపారు. సమావేశంలో జెడ్‌పి చైర్‌పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ జయరాంకృష్ణ, గృహనిర్మాణ శాఖ పీడీ ఎన్.గణపతి, వ్యవసాయ, పశు సంవర్థకశాఖ జెడిలు కె.శ్రీధర్, ఎం.కిషోర్, డ్వామా పీడీ జి.వి చిట్టిరాజు, సమగ్ర శిక్ష ఎపిసి ఆర్.జయప్రకాష్, జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, సిపిఒ వి.ఎస్.ఎస్.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










