
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఎరువుల ధరలకు రెక్కలు వచ్చాయి. గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పి) కంటే ఎక్కువ ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి. ప్రధానంగా యూరియా బస్తా ఎంఆర్‌పి రూ.266.50 ఉండగా వ్యాపా రులు రూ.380 వరకు విక్రయిస్తున్నారు. పల్నాడు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ తతం తగం ఎక్కువగా జరుగుతోంది. వర్షాభావం వల్ల పైర్లు బెట్టకు వస్తున్నాయి. ఈ ఉపద్రవం నుంచి పైర్లను కాపాడుకునేందుకు యూరియా లేదా పొటాషియం నైట్రేట్‌ను వినియోగించుకోవాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. దీంతో రైతులు యూరియా కొనుగోలుకు ఆసక్తి చూపగానే వ్యాపారులు ధరలు పెంచారు. యూరియా లేక పొటాషియం నైట్రేట్ పిచికారి చేయడం వల్ల పైరును బతికించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో గత వారం రోజుల్లో ఎరువుల వినియోగం పెంచారు. ప్రస్తుతం మిర్చి, వరికి కూడా ప్రస్తుతం యూరియా అవసరం ఏర్పడింది. ఇదే అదనుగా వ్యాపారులు ధరలను పెంచి విక్రయిస్తున్నారు.
నిరక్ష్యరాస్యులైన రైతులకు అప్పు రూపంలో ఇచ్చే ఉత్పత్తులకు అధిక ధరలకు విక్రయించడం వ్యాపారులకు పరిపాటిగా మారింది. సేద్యానికి బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడం వల్ల రైతులు ప్రైవేటు వ్యాపారులపై ఆధారపడుతున్నారు. విత్తనాలు,ఎరువులు, పురుగుమందులు వ్యాపా రులు చెప్పిందే ధర, ఇచ్చిందే సరుకు అన్నట్టుగా సాగుతుంది. సాధారణ కంపెనీలకు చెందిన ఎరువులు, పురుగు మందులతోపాటు బయో ఉత్పత్తులనూ రైతులకు అంటగడుతున్నారు. పల్నాడు, గుంటూరు జిల్లాలో లక్ష ఎకరాల్లో మిర్చి సాగు అవ్వగా పైరు ఎదుగుదల దశలో ఉంది. దీంతో ఎరువుల వినియోగం అనివార్యంగా మారింది. గుంటూరు, పల్నాడు జిల్లాలో 1.65 లక్షల ఎకరాల్లో వరిపొట్ట దశలో ఉంది. వర్షాభావం నుంచి బయటపడేందుకు ఎరువుల వినియోగం కొంత వరకు అయినా కాపాడుతుందని రైతులు భావిస్తున్నారు.
గతేడాది కంటే ఈఏడాది సాగు తగ్గడం వల్ల యూరియా, డిఎపి, కాంప్లెక్స్ వినియోగం గణనీయంగా తగ్గింది. దీంతో వ్యాపారులు చాలా కొంత వరకు నష్టపోయారు. పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని అంటూ రైతుల వద్ద బస్తాకు రూ.80 నుంచి రూ.120 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. గురజాల మండలం చర్లగుడిపాడు అమరనాథ్ ట్రేడర్స్‌లో ఇటీవల విజిలెన్సు అధికారులు తనిఖీలు చేసి అధిక ధరలకు విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఎంఆర్‌పి రూ.266.50 కాగా బస్తారూ.380కు విక్రయిస్తుండగా పట్టుకుని షాపును ఎరువుల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. బస్తాకు రూ.113.50 అదనంగా విక్రయించినట్టు గుర్తించినట్టు విజిలెన్సు ఎస్‌పి ఈశ్వరరావు తెలిపారు. ఎవరైనా ఎంఆర్‌పి కంటే అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.