ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
- 769 బస్తాలు సీజ్
- ఇద్దరు వ్యాపారస్తులపై కేసు నమోదు
ప్రజాశక్తి - అవుకు
పట్టణంలోని బిసి వెంకటసుబ్బయ్య ఫర్టిలైజర్స్, ఎంసిఎస్ నరసింహులు ఫెర్టిలైజర్స్ దుకాణాలను విజిలెన్స్ అధికారులు శనివారం తనిఖీ చేశారు. విజిలెన్స్ సిఐ నాగరాజు యాదవ్ బృందం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించినట్లు వ్యవసాయ అధికారి ప్రసాదరావు తెలిపారు. యూరియా, డిఏపి మందులను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న రైతుల సమాచారం మేరకు ఈ రెండు దుకాణాలపై దాడులు చేపట్టారు. ఎంసిఎస్ నరసింహులు ఫెర్టిలైజర్స్ దుకాణంలో యూరియా గవర్నమెంట్ నిర్ణయించిన ధర 267 రూపాయలు ఉండగా 320 రూపాయలకు బస్తా అమ్ముతున్నట్లు గుర్తించామని, బిసి వెంకట సుబ్బయ్య ఫర్టిలైజర్స్ దుకాణంలో డిఎపి ధర 1347 రూపాయలకు గాను రూ.1400లకు అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు. యూరియా 666 బస్తాలు, డిఎపి 103 బస్తాలను సీజ్ చేసి రెండు దుకాణాలకు చెందిన వ్యాపారస్తులు ఎంసిఎస్ నరసింహులు, బచ్చు నాగరాజులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఈ రెండు దుకాణాలపై విజిలెన్స్ అధికారులు పలుమార్లు దాడులు చేసి కేసులు నమోదు చేసినప్పటికీ కూడా మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తూ ప్రతి సంవత్సరం పట్టుబడడం పరిపాటిగా మారిందని మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అదికారులు ఈ రెండు దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకొని మళ్లీ ఇటువంటి తప్పులు జరగకుండా చూడాలని మండల ప్రజలు, రైతులు కోరుతున్నారు.










