Apr 10,2021 07:03

  ఆంధ్రప్రదేశ్‌లో వరి పంటకు ఎకరాకు ఐదు వేల రూపాయల విలువ కల్గిన ఎరువులు వాడతారు. కొత్తగా పెరిగిన ధరల వలన రైతులపై రూ. ఐదు వేల అదనపు భారం పడుతుంది. మిరప, పసుపు పంటల్లో ఎరువుల వినియోగం ఆధికంగా వుంటుంది. సగటున ఎకరాకు 20 నుంచి 25 బస్తాల ఎరువులు వాడుతారు. వీటి ధరలు 58 శాతం పెరిగితే రూ.10 వేలు ఖర్చు అదనం అవుతుంది. రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. పెరిగిన ధరల ప్రకారం లెక్కగడితే కేవలం వరి రైతాంగం మీద సుమారు రూ. మూడున్నర వేల కోట్ల భారం పడుతుంది.
   కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను 58 శాతం పైగా పెంచడంతో సాగు చేయడం పెనుభారమైంది. ఇప్పటికే సాగు గిట్టుబాటు కాక ఆత్మహత్యలు, ఆకలి చావుల బారిన పడుతున్న రైతులు, కౌలుదార్లకు ఇది గోరుచుట్టుపై రోకటి పోటు లాంటిది. డిఎపి ధర రూ.1200 నుండి రూ.1900కు, యన్‌పికె రూ.1175 నుండి రూ.1775కు, యన్‌పి రూ.1185 నుండి రూ.1800కు ధరలు పెంచారు. ఇదీ కరోనా సమయంలో రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బహుమతి.
   ఆంధ్రప్రదేశ్‌ లో ఖరీఫ్‌, రబీ సీజన్లుకు కలిపి 18.50 లక్షల టన్నుల ఎరువులు వాడతారు. తెలంగాణలో 13 లక్షల టన్నుల ఎరువులను వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో వరి పంటకు ఎకరాకు ఐదు వేల రూపాయల విలువ కల్గిన ఎరువులు వాడతారు. కొత్తగా పెరిగిన ధరల వలన రైతులపై రూ. ఐదు వేల అదనపు భారం పడుతుంది. మిరప, పసుపు పంటల్లో ఎరువుల వినియోగం ఆధికంగా వుంటుంది. సగటున ఎకరాకు 20 నుంచి 25 బస్తాల ఎరువులు వాడుతారు. వీటి ధరలు 58 శాతం పెరిగితే రూ.10 వేలు ఖర్చు అదనం అవుతుంది. రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. పెరిగిన ధరల ప్రకారం లెక్కగడితే కేవలం వరి రైతాంగం మీద సుమారు రూ. మూడున్నర వేల కోట్ల భారం పడుతుంది.
   కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి భారీ కోత విధించారు. గత సంవత్సరం 5.1 వాటా నుండి 4.3 శాతానికి తగ్గింది. 20 లక్షల కోట్ల కరోనా ఆత్మ నిర్భర భారత్‌ ప్యాకేజీలో రైతులకు ఇప్పటి వరకు ఏమీ అందలేదు. గత సంవత్సరం వ్యవసాయ అనుబంధ రంగాలకు బడ్జెట్‌ రూ.లక్షా యాభై వేల కోట్లు అయితే ఈ సంవత్సరం రూ.లక్షా 48 వేల కోట్లకు తగ్గించింది. పి.ఎం.కిసాన్‌ పథకం కింద గత సంవత్సరం రూ.75 వేల కోట్లు కేటాయించి ఈ సంవత్సరం రూ.65 వేల కోట్లకు తగ్గించారు. పంట రుణాలపై వడ్డీ సబ్సిడీ రూ.21 వేల కోట్లు ఉంటే ఈ సంవత్సరం రూ. 19 వేల కోట్లకు కుదించారు. మద్దతు ధరల మార్కెట్‌ జోక్యం పథకం కేటాయింపు రూ. రెండు వేల కోట్ల నుండి రూ. 1500 కోట్లకు తగ్గింది. ఎరువుల కోసం గత సంవత్సరం రూ. 79 వేల కోట్లు సబ్సిడీ అయితే ఈ సంవత్సరం రూ. 65 వేల కోట్లు మాత్రమే అంటే రూ. 14 వేల కోట్లకు కోత పెట్టారు. అందువల్లే ఎరువుల సబ్సిడీ తగ్గింది. ఈ రోజుకి కూడా 40 శాతం యూరియా, 60 శాతం డిఎపి 100 శాతం పొటాషియంను దిగుమతి చేసుకుంటున్నాం. అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ రంగానికి భారీగా సబ్సిడీలు ఇస్తున్నాయి. 2016 సంవత్సరంలో అమెరికా ప్రభుత్వం సగటున రైతుకు 7250 డాలర్లు, జపాన్‌ ప్రభుత్వం 3480 డాలర్లు సబ్సిడీ అందజేశాయి (ఒక డాలరుకు 75 రూపాయలు). భారత దేశంలో రైతుకు సగటున కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సబ్సిడీ 2018-19 సంవత్సరంలో కేవలం 49 డాలర్లు మాత్రమే. ఎంత సిగ్గుచేటు! ప్రతి సంవత్సరం సాగు ఖర్చులు పెరుగుతున్నప్పటికీ పండిన పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు. డా||స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేయడం లేదు. దీనివల్ల తక్కువ ధరలకే పంటలను దళారులకు అమ్ముకొని సంవత్సరానికి దేశవ్యాప్తంగా రూ.రెండున్నర లక్షల కోట్లు రైతులు నష్టపోతున్నారు.
   దేశంలో 50 శాతం, రాష్ట్రంలో 80 శాతం భూమిని కౌలురైతులే పండిస్తున్నారని ఓ అంచనా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రైతు భరోసా కౌలు రైతులకు చెల్లించడం లేదు. పంట రుణాలు ఇవ్వటం లేదు. కౌలు గుర్తింపు కార్డు లేకపోవడం చేత కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరలకు పంటలు అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాలకు పరిహారం కూడా అందడం లేదు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 50 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మన రాష్ట్రంలో రెండు వేల మందికి పైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇందులో 90 శాతం కౌలురైతులే. దీనికి ప్రధానమైన కారణం ప్రతి సంవత్సరం పెరిగే సాగు ఖర్చులు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం. ఏటేటా పెరిగే కౌలు రేట్లు, వడ్డీ రేట్లతో వ్యవసాయం భారంగా మారింది. కృష్ణా జిల్లా చల్లపల్లి ఏరియాలో ఎకరానికి 28 నుండి 32 బస్తాలు కౌలు, గుంటూరు జిల్లా కొల్లూరు ప్రాంతంలో ఎకరానికి రూ. 40 వేల నుండి రూ.50 వేలు నగదు కౌలు ఉంది. పండించిన పంటలో 30 శాతం మించి కౌలు చెల్లించకూడదని చట్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోదు.
   అన్నదాతలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు 58 శాతం పెంచడం దారుణం. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌, పురుగుమందుల ధరల పెంపుతో సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ఎరువుల ధరలు పెరుగదల మూలిగే నక్కపై తాడి పండు పడ్డ చందంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి.
 

/ వ్యాసకర్త రాష్ట్ర ప్రధాన కార్యదర్శి /
పి. జమలయ్య

పి. జమలయ్య