అదనుకు పడని వానలు, అక్కడక్కడ వరదలూ వర్షాభావం, ఆనక కరోనా కట్టకట్టుకొని ఏక కాలంలో ఖరీఫ్ రైతుపై దాడి చేస్తుండగా, సరిగ్గా ఇప్పుడే ఎరువుల తంటా వచ్చిపడింది. కాస్త ఆలస్యంగా సీజన్ చివరిలో కురుస్తున్న వర్షాలతో సాగు సాగిద్దామనుకున్న అన్నదాతలకు ఎరువులు దొరకని దుస్థితి దాపురించింది. రైతులు పంటలు పండించేందుకు కావాల్సిన ఉత్పాదకాలను సరిపడా అందుబాటులో ఉంచడం ప్రభుత్వ కనీస బాధ్యత. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అన్నింటికీ రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బికె) పూచీ పడతాయని, వ్యవసాయదారులకు చింత వలదని ప్రభుత్వం తరచూ వల్లె వేస్తోంది. ఆచరణలో అదెక్కడా కానరావడంలేదు. ఉదాహరణ ఒక్క ఉదుటన వచ్చిన పడ్డ ఎరువుల కొరత. డిఎపి, కొన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులు అటు ఆర్‌బికెలలో ఇటు బహిరంగ మార్కెట్‌లో ఎక్కడా తగినంత నిల్వలు లేవు. డిఎపి బస్తా గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పి) రూ.1,200 కాగా రాష్ట్రంలో ఎక్కడా ఆ రేటుకు దొరకట్లేదు. అదనంగా రూ.50-70 రైతులు చెల్లిస్తే, అది కూడా స్టాక్ ఉంటే లభిస్తోంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఏప్రిల్‌లో రూ.1,325 ఉండగా 1,550. ఇంకా వాటి ధరలు పెరుగుతాయని కంపెనీలు సంకేతాలిస్తున్నాయి. ఇప్పటికే పంటలకు గిట్టుబాటు ధరల్లేక, వ్యవసాయ పెట్టుబడులు అంతకంతకూ పెరుగుతున్న వేళ ఎరువుల ధరల బాదుడు రైతుకు గోరుచుట్టుపై రోకలి పోటు వంటిది. ఈ అదనపు భారాలను మోయాల్సింది వాస్తవంగా భూమిపై శ్రమిస్తున్న కౌలు, సన్న చిన్నకారు రైతులే.
ఖరీఫ్ మొదలవుతుందనగానే డిఎపి, కాంప్లెక్స్ ఎరువుల ధరల భారీ పెంపుదలకు కంపెనీలు ఉపక్రమించగా, రైతుల నుండి పెల్లుబుకుతున్న ఆగ్రహం, ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికలు వీటిని దృష్టిలో పెట్టుకొని కేంద్రంలోని బిజెపి సర్కారు ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే వరకు ఎరువుల ధరలు పెరగవని హామీ ఇచ్చింది. కానీ అది ఆచరణకు నోచుకోలేదు. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయని చెప్పి కంపెనీలు ధరలు పెంచాయి. సూక్ష్మ పోషక ఎరువులపై కేంద్రం ఇస్తున్న సబ్సిడీ సరిపోదని తెగేసి చెబుతున్నాయి. ఎరువుల తయారీలో అవసరమైన ఫాస్ఫారిక్ యాసిడ్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఏడాదిలో 80 శాతం పెరిగిందని గుర్తు చేస్తున్నాయి. సబ్సిడీ పెంచకపోతే ధరలు పెంచుతామని హెచ్చరిస్తున్నాయి. అంతర్జాతీయ విపణిలో ధరలు, ప్రభుత్వ అశక్తి కారణంగా కంపెనీలు దిగుమతులను, ఉత్పత్తిని తగ్గించేశాయి. ఆ పర్యవసానమే ఎరువుల కొరత. సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నామని, రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తున్నామని ఊదరగొడుతున్న బిజెపి ప్రభుత్వమే ఎరువుల సబ్సిడీ పద్దును, ఖర్చును క్రమేపి తగ్గిస్తోంది. సూక్ష్మ పోషక ఎరువులకు ఫిక్స్‌డ్ సబ్సిడీ ఇవ్వడంతో ఎరువుల కంపెనీలు ధరలు పెంచి రైతులపై భారం వేస్తున్నాయి. నత్రజని, పొటాషియం, సల్ఫర్ (ఎన్-పి-కె)లకు కేంద్రం సబ్సిడీలు పెంచితే ఆ మేరకు రైతులకు కొంతైనా ఉపశమనం లభిస్తుంది. కేంద్రం అందుకు సుతరాం ఇష్టపడట్లేదు.
కేంద్ర ఎరువుల విధానంపై రాష్ట్ర వైసిపి ప్రభుత్వం పల్లెత్తి మాట్లాడట్లేదు. సందర్భం వచ్చినప్పుడు మాత్రం తన బేలతనాన్ని కప్పిపుచ్చేందుకు కేంద్రం వైపు వేలు చూపిస్తోంది. ఉదాహరణకు యూరియాపై కంట్రోల్ ఉన్నప్పటికీ, రవాణా, హ్యాండ్లింగ్ ఛార్జీలు ఇవ్వడం లేదనే పేరుతో కంపెనీలు అదనంగా రైతుల నుండి వసూలు చేస్తున్నాయి. ఈ విషయం ప్రభుత్వ దృష్టికొచ్చిన ప్రతిసారీ లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించడం తప్ప కేంద్రాన్ని అడిగింది లేదు. ఆర్‌బికెల ద్వారా ఎరువుల సరఫరా అంటున్నా సక్రమంగా, అన్ని సదుపాయాలతో పని చేస్తున్నవి చాలా తక్కువ. గోదాముల సదుపాయం లేదు. రైతులు ముందుగా ఆర్డర్ పెట్టాలి. పైగా రైతులకు అవసరమైన కంపెనీలవి కాకుండా వేరే వాటిని అంటగడుతున్నారు. ఆర్‌బికెలలో సైతం అధిక ధరలున్నాయని ఆరోపణలూ వెలుగు చూశాయి. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలి. ఎంఆర్‌పి, నాణ్యత ఉల్లంఘనులపై కఠినంగా వ్యవహరించాలి. ఎరువుల కేటాయింపులు, విధానాలపై కేంద్రాన్ని ప్రశ్నించాలి.










