ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి అనేక కష్ట నష్టాలు నడుము ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాతలు మళ్లీ ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుంటే సాగుకి డోకా ఉండదు. ఈ నేపథ్యంలో జిల్లాలో సాగు నీటి వనరులన్నీ పుష్కలంగా ఉండే అవకాశం ఉంది. గత ఖరీఫ్, ఈసారి రబీలో అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్న కర్షకులు ఈ ఖరీఫ్ పైనే ఆశలు పెట్టుకున్నారు. మళ్ళీ సాగుకు సన్నద్ధం అవుతున్నారు. అందుకు తగ్గట్టుగా వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. జిల్లాలో రబీ కోతలు దాదాపుగా ముగియగా రైతులు ధాన్యం అమ్మకాలు కూడా పూర్తి చేసారు. వ్యవసాయ శాఖ ఖరీఫ్ ప్రణాళికలో భాగంగా జిల్లాలో సాగు లక్ష్యాన్ని నిర్దేశించడంతోపాటు ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగవుతాయి. వాటికి రాయితీపై ఎన్ని విత్తనాలు అందించాలి, ఎరువులు ఎంత అవసరం ఇలా అన్నివిధాలుగా ప్రణాళిక సిద్ధం చేయడంతోపాటు ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించారు.
అన్ని ప్రాంతాలకూ అనుకూలం
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు ఉండగా 6 సబ్ డివిజన్ల పరిధిలో 414 ఆర్‌బికెలు ఉన్నాయి. గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా మళ్లీ అదే ప్రాంతాలకు సార్వాకు అవకాశం ఇవ్వడానికి నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే జిల్లాలో 21 మండలాల్లో ఉన్న అన్ని ప్రాంతాలకు కాలువల ద్వారా ఈ ఏడాది కూడా ఖరీఫ్‌కు అవసరమైన నీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పు డెల్టాతో పాటు ఏలేరు, పంపా, తాండవ, పుష్కర ఎత్తిపోతల పథకాల క్రింద ఆయకట్టు, మెట్ట మండలాల్లో సైతం వరి సాగుకి సన్నద్ధం అవుతున్నారు. ఈ నెల 15 నుంచి 20 వ తేదీ వరకూ నారుమళ్లు సిద్ధం చేసుకోవాలని, వెదజల్లు సాగు చేసుకోవాలని, జూలై 15 నుంచి 20 లోపు నాట్లు వేయడాన్ని పూర్తి చేయాలని,ఒకటో 31నాటికల్లా కోతలు పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసారు.
రాయితీపై విత్తనాలు
ఖరీఫ్‌లో ఆయా ప్రాంతాల్లో సాగు చేసే పంటలను బట్టి అవసరమైన విత్తనాలను ప్రభుత్వం రాయితీపై ఇచ్చే విధంగా చర్యలు చేపట్టింది. ఆయా మండలాలకు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వరి సాగుచేసే వారికి ఎంటియు 7029, 1318, ఆర్‌పి బయో 276 తదితర రకాల విత్తనాలను, సబ్సిడీ విత్తనాలు సిద్ధం చేస్తున్నారు. 25 శాతం ఎరువులు, విత్తనాలను ఆర్‌బికెల ద్వారా పంపిణీ చేస్తారు. యూరియా, నత్రజని, ఎంఒపి, డిఎపి కాంప్లెక్స్ తదితర ఎరువులతో కలిపి 61,836 మెట్రిక్ టన్నులు సిద్ధం చేస్తున్నారు.










