తూర్పున బాలభానుడు ఎర్రెర్రని వెలుగు రేఖలతోనే లోకానికి చైతన్యపు కిరణాలను ప్రసరిస్తాడు. ఆ ఎరుపు మెరుపుల తొలి కాంతులతోనే లోకం నిన్నటి లోంచి నేటి లోకి మేల్కొంటుంది. ఆశనూ, శక్తినీ సంపూర్ణంగా సంతరించుకొని ఆనందావహ ప్రవాహంగా సాగిపోతుంది. ఎరుపు శక్తికీ, చైతన్యానికీ సంకేతం. ఎరుపు సజీవత్వానికి, సమరతత్వానికి ఎత్తిపట్టిన జయ జయ పతాకం. ప్రపంచాన ఎన్నెన్ని వర్ణాలు ఉన్నా, ఎన్నెన్ని సామాజిక అంతరాలు దొంతరలు కడుతున్నా- అందరిలోనూ ప్రవహించేది ఎర్రని రక్తమే అన్న ఉద్బోధన... మనుషుల మధ్య ఎల్లలెరగని బంధాన్ని పెనవేసే సౌభ్రాతృత్వ సద్భావన. ఇలా చూసినప్పుడు ఎరుపు ఒక సమతా సందేశం. ఎల్లలోకాన్ని ఒక్క ఇల్లుగా చూపే అపూర్వ సన్నివేశం. పచ్చదనంతో పరవశించే ప్రకృతిలో అరుణారుణ రేకలతో అలరారే ఎర్రెర్రని పూలు ఎంతో ప్రత్యేక శోభని రంగరిస్తాయి. ఎర్రని మందారాలూ, మంకెనపూలూ, అగ్నిపూలూ ఎంత దూరాన ఉన్నా మన చూపునూ, మనసునూ తమలో మమేకం చేసుకుంటాయి.
వివాహ వేడుకలో నవ వధువును ఎర్రచీరతో అలంకరించటం ఓ ఆనవాయితీగా భావిస్తారు. ఎర్రని సింధూర ధారణను కొందరు ఓ అలవాటుగా ఆచరిస్తారు. కాయలు బాగా ఎరుపెక్కితేనే రసభరిత మధుర ఫలాలుగా మారతాయని రైతులు లెక్కకడతారు. ఎర్రని కారంతో కలగలిపితేనే కూరలకు మంచి రుచి వస్తుందని పాక ప్రవీణులు తెడ్డు కొట్టి మరీ చెబుతారు. సాయంసంధ్యలూ, గోధూళి వేళలూ, వెలుగునిచ్చే దీపాలూ, వంటకు పనికొచ్చే మంటలూ ... ఇలా అన్నీ ఎర్రదనం నింపుకొని జనుల వాడుకకు, వాడకానికీ ఎంతగానో దోహదపడుతున్నాయి. ఎర్రని దీపాలున్న ట్రాఫిక్ సిగల్ వ్యవస్థ మన జీవన గమనానికి దిక్సూచిలా ఉపయోగపడుతుంటే- ఒంట్లోని ఎర్రరక్త ప్రవాహం మన ఆరోగ్య సూచికగా ప్రకటితమవుతోంది.
ఆదిమ కాలంలో నిప్పు ఆవిష్కరణ మొదలుకొని ఆధునిక కాలంలో నిప్పులు కురుస్తూ నింగికెగసే రాకెట్ల ప్రయాణం దాకా మానవ మనుగడలో ఎరుపు పాత్రా, ప్రమేయమూ అవినాభావం, అమోఘం. జనావళి జరుగుబాటులో ఇంత బంధమూ అనుబంధమూ పెనవేసుకున్న ఎరుపు మీద కొందరికి ఎందుకనో తీవ్రమైన అక్కసు. మరికొందరికేమో భయమూ అసహనమూ. ఏ విధంగా చూసినా ఎరుపుది జనావళితో మైత్రీబంధమే తప్ప మరొకటి కాదు. మరి ఈ బాపతు ఎందుకింతగా ఎరుపు పట్ల ఎందుకింత వెరపు ప్రదర్శిస్తారంటే- బహుశా ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా ఉత్పత్తి సంబంధాల మీద గుత్తాధిపత్యం సంపాదించడమో, అలాంటి ఆధిపత్యాన్ని అంగీకరించే, సమర్థించే మైండుసెట్టు ఉండడమో కారణం కావొచ్చు !
నిజానికి ఎరుపు మానవ సమాజానికి సహజ నేస్తం. సమస్త ప్రపంచం సంక్లిష్టతలూ సంక్షోభాలూ లేని జనహిత వ్యవస్థగా ప్రవర్ధమానం చెందాలని మేల్కొలిపే శాస్త్రీయ సిద్ధాంత సంకేతం. అనేక అంతరాల ఊబులను సృష్టించిన పెట్టుబడిదారీ వ్యవస్థ - కోవిడ్ లాంటి మహమ్మారితో తల్లడిల్లిపోతుంటే- దాన్ని విజయవంతంగా నియంత్రించగలిగింది ఎర్రజెండా స్ఫూర్తి ఉన్న దేశాలే! కోవిడ్ బాధిత ప్రజల బాధ్యతను కార్పొరేట్లకు వదిలేసిన చాలా రాష్ట్రాలకు భిన్నంగా దేశంలో ప్రజలకు గొప్ప ధైర్యాన్ని, దన్నునీ ఇస్తున్నది కేరళ లోని ఎర్రజెండా పాలనే! బెంగాల్‌లో ఓటమితో కమ్యూనిస్టుల పని అయిపోయిందని చంకలు గుద్దుకున్న కుబుద్ధులకు - ఇప్పుడు అక్కడ ప్రజలకు అనేక విధాలుగా సేవలు అందిస్తున్న 80 వేల మంది ఎర్రసైన్యం ఓ కనువిప్పు. తెలుగు రాష్ట్రాలు రెండింటా తమ పార్టీ కార్యాలయాలను కోవిడ్ సెంటర్లుగా మార్చి, వైరస్ బాధిత ప్రజలకు సేవలందిస్తున్న ఏకైక రాజకీయ పార్టీ సిపిఎం. ప్రముఖ కవిగాయకుడు సుబ్బారావు పాణిగ్రాహి అన్నట్టు - ''ఎరుపంటే కొందరికి భయం భయం.. పసిపిల్లలు వారికన్న నయం నయం.'' ఎవరెలా భావించినా, వ్యాఖ్యానించినా కష్టకాలంలో జనం పక్షాన నికరంగా, నిర్భయంగా, నిర్ద్వంద్వంగా నిలబడి ఎగిరేది ఎర్రజెండానే! అలాంటి చారిత్రిక సన్నివేశమే ప్రస్తుత కష్టకాలంలో దేశం కళ్లకు కడుతోంది. తొడుక్కున్న కళ్లద్దాలు ప్రకృతి విరుద్ధమైనవి కాకుంటే ప్రతి కంటికీ ఎరుపు సేవానిరతి, త్యాగ సంపత్తి విస్పష్టంగా కనిపిస్తుంది. ఎరుపు.. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ జనహిత కేతనం ! జయజయ పతాకం.










