Aug 17,2023 21:49

నిరసన తెలుపుతున్న ఆదివాసీ గిరిజన సంఘం సభ్యులు

ప్రజాశక్తి -గుమ్మలక్ష్మీపురం : జియమ్మవలస మండలం తురకనాయుడువలసలో నివాసముంటున్న ఎరుకల కులస్తులకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోరంగి సీతారాం మాట్లాడుతూ తురకనాయుడువలసలో ఎరుకల కులస్తులకు అనేక ఏళ్ల నుండి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం ఇస్తున్నప్పటికీ తురకనాయుడువలస గ్రామ రెవెన్యూ అధికారి గ్రామ పెద్దలు ఇవ్వొద్దన్నారని అందుకే ఇవ్వడం లేదని బాధ్యతారహితంగా చెబుతున్నారని అన్నారు. ఎరుకల కులస్తులకు ఎస్టీ కులధ్రువీకరణ పత్రం మంజూరు చేయకపోవడం వల్ల వారి పిల్లలు సుమారు 30మంది ఐదో తరగతి వరకు చదివి మధ్యలోనే చదువులు నిలిపివేసే పరిస్థితి ఉందన్నారు. వారి భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారనున్నది కాబట్టి వెంటనే తహశీల్దార్‌ చొరవచేసి తురక నాయుడువలసలో గల ఎరుకల కులస్తుల సర్టిఫికెట్లు విచారణ చేసి వారికి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని లేకపోతే భవిష్యత్తులో వీరందరినీ పార్వతీపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేయాల్సి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు పాల్గొన్నారు.