Mar 27,2023 01:41
విద్యార్థులతో మాట్లాడుతున్న డాక్టర్‌ బాబురావు

ప్రజాశక్తి-చీరాల: ఎర్త్‌ అవర్‌ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే వాతావరణ దినోత్సవం అని, గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా జీవరాశి ఉనికి ప్రశ్నార్థకంగా మారినందున భూమిని కాపాడుకుందామని రోటరీ క్లబ్‌ చీరాల అధ్యక్షుడు డాక్టర్‌ ఐ బాబూరావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పాటించే ఎర్త్‌ అవర్‌ని పురస్కరించుకొని స్థానిక సాయి ప్యాలెస్‌ రోడ్‌లోని ఆనంద నిలయం సంక్షేమ వసతి గృహంలో విద్యార్థినులతో ఎర్త్‌ అవర్‌ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్‌ చీరాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాబూరావు మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించుకుందామనే అంటూ పర్యావరణవేత్తలు ఎర్త్‌ అవర్‌కు శ్రీకారం చుట్టారని అన్నారు. ఎర్త్‌ అవర్‌ అంటే ఓ గంట పాటు విద్యుత్‌ వినియోగాన్ని ఆపేయడమే కాదని మనం నివసించే భూమిని కాపాడుకునే ఆలోచనలకు శ్రీకారం చుట్టడం అని అన్నారు. కరెంట్‌ బల్బులు, టీవీలు, కంప్యూటర్లు వగైరా కరెంటుతో నడిచే ఉపకరణాలన్నీ కాసేపు స్విచ్‌ ఆఫ్‌ చేయడం ద్వారా ఇలా విద్యుత్‌ ఆదా చేస్తే ఆ మేరకు భూ వాతావరణాన్ని పరిరక్షించినట్లేనని అన్నారు. 2007వ సంవత్సరంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దీన్ని మొదలు పెట్టారని అన్నారు. ప్రతి సంవత్సరం సాధారణంగా మార్చి మాసంలోని చివరి శనివారం రాత్రిపూట ఒక గంట విద్యుత్‌ ఉపకరణాలు అన్నింటినీ ఆపివేయటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దీనిని జరుపుకుంటూ ఇప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా ఎర్త్‌ అవర్‌ పాటించే విధంగా చైతన్యం తీసుకురాగలిగారన్నారు. అనంతరం విద్యుత్‌ పరికరాల ఆపివేసి కొవ్వొత్తులతో మానవహారం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ బాపట్ల జిల్లాకు ఆర్డినేటర్‌ పవని భానుచంద్రమూర్తి, గీతా యంగ్‌ సైంటిస్ట్‌ అధ్యక్షులు వలివేటి మురళీకృష్ణ సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.