ప్రజాశక్తి - నకరికల్లు : అడ్డూ అదుపు లేకుండా ఎర్ర మట్టిని అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. వీరి చర్యలు కొండలు, గుట్టలు మాయమవుతున్నాయి. ఎర్ర మట్టికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో నకరికల్లు మండలంలోని త్రిపురాపురం క్వారీలో అనుమతులు లేకుండానే రాత్రింబవళ్లు మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్, అధికారులకు ఎవరైనా సమాచారం అందజేస్తే తూతూ మంత్రంగా తనిఖీలతో సరిపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో టిప్పర్ మట్టి ధర రూ.6 వేలకు, ట్రాక్టర్ మట్టిని రూ.వెయ్యికి అమ్ముకుంటున్నారు. కొంతమంది గ్రూపుగా ఏర్పడి చేస్తున్న ఈ దందాలో అధికార పార్టీకీ చెందిన వారున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నాలుగు రోజుల నుండి మట్టి తవ్వకాలు జరుగుతున్న విషయం తెలిసి ఇన్‌ఛార్జి ఆర్‌ఐ రాజారెడ్డి, త్రిపురాపురం వీఆర్వో మార్క్ తవ్వకాల ప్రదేశాన్ని మంగళవారం పరిశీలించి తవ్వకాలను ఆపేయించారు. అయితే కేసులేమీ పెట్టించలేదని తెలిసింది. వివరణ కోసం ఇన్‌ఛార్జి ఆర్‌ఐను సంప్రదించగా సమాధానం ఇవ్వలేదు. తహశీల్దార్ సురేష్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు.










