నాన్నెప్పుడు కండువా కప్పుకుంది లేదు
పట్టుబట్టల్లో దూరి ప్రతిష్ఠ కోసం
పాకులాడింది లేదు
తాత ముత్తాతల బిల్లగోచీ కొనసాగింపన్నట్టు
మొల్లోనో మెల్లోనో ఎర్రతువ్వాలు దోగాడేది
కారు అద్దం చెమ్మ తుడవడానికి
వైపర్‌కి బటన్ నొక్కాలి
నాన్న ముఖాన చెమట తుడవడమని
ఎర్రతువ్వాలుకి ఎవరూ చెప్పనక్కరలేదు
స్నానం తంతులో రెండు చెంబులు
దిమ్మరించుకున్నాక
సబ్బు కోసం వెతుకుతాడో లేదో గానీ
ఎర్రతువ్వాలు కోసం
మెలుకువలోనే కలవట్లాడతాడు
పరిగెడుతు కాలాన్ని ఓవర్ టేక్ చెయ్యాలన్న
తలంపే లేని నాన్నకు
కాలం చేసే గాయాల్ని మోస్తున్నప్పుడల్లా
తలపాగ అయ్యి తల్లిలా తలనిమిరేది
కాయకష్టం కన్నా భాగ్యముండదనే
నమ్మకాన్ని బలపరుస్తూ
సుఖమెరగని నిద్రకు పరుపులా అమిరిపోయేది
నాన్నలాగే అచ్చం ఆ ఎర్రతువ్వాలు
ఎక్కడ బడితే అక్కడ ఎలా బడితే అలా
ఇంటి మొత్తానికి కాపలా కాస్తు
అరుగు మీద నాన్న
నాన్నకు తోడుగా
భుజాన్ని అంటిపెట్టుకుని తువ్వాలు !
నాన్నెప్పుడూ ఖరీదైన బట్ట కట్టింది లేదు
ఒకేళ కట్టినా
మనసు మాత్రం ఎర్రతువ్వాలు కోసమే
వెతుకులాడేది
ఉక్కపోతకు లోకం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే
నాన్న తువ్వాలూపుకుంటూ నవ్వుకునే వాడు
చలి ముసిరే కాలానికి రగ్గులా కప్పుకునే వాడు
సూర్యుడు మాడ్చి చంపేస్తాడనే భయం లేదు
వాన ఒళ్ళంతా తడిపేస్తుందన్న బెరుకూ లేదు
ఎర్రతువ్వాలు అడ్డంగా నిలబడిపోద్దన్న
నమ్మకం నాన్నది !
తెలియని కష్టమేదన్నా వచ్చి కంటనీరు పెట్టుకుంటే
ఊరుకో ఏంటి మరీ చిన్నపిల్లాడిలాగ
ఎవరన్నా చూస్తే బాగోదని కళ్ళు తుడుస్తూ
అచ్చం అమ్మలాగే ఓదార్చేది !
నాన్న బలం బలగం ఆ ఎర్ర తువ్వాలే
నాన్న జానేమన్ నిజంగా ఆ ఎర్ర తువ్వాలే !
- బంగార్రాజు
85003 50464